చెన్నై సిటీ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. రోడ్లు, అనేక కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పటికీ ఆ సాయం కొంతమందికి మాత్రమే అందుతోంది. ప్రభుత్వం గానీ, అధికారులు గానీ, స్థానిక ప్రజాప్రతినిధులు గానీ తమ దుస్థితిని పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సరఫరా, పాలు, కూరగాయలు లేక ప్రజలు అల్లాడుతున్నారు. పత్రికా కార్యాలయాలు నీట మునగడంతో దిన పత్రికలు కూడా బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.
మరో రెండు రోజుల పాటు వర్షాలు పడవచ్చన్న హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెన్నై విమానాశ్రయాన్ని ఈ నెల 6 వ తేదీ వరకు మూసివేశారు. ఈ నగరానికి వచ్చే పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్ టవర్లు కూడా పని చేయకపోవడంతో సెల్ ఫోన్లు మూగబోయాయి. తమిళనాడులో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచం తో సంబంధాలు తెగిపోయాయి. ప్రముఖుల నుంచి విరాళాలు, బట్టలు, ఇతర సహాయక పదార్థాలు అందుతున్నప్పటికీ వాటిని రవాణా చేసే సౌకర్యం లేక ఎక్కడివక్కడే ఉంటున్నాయి.





