గ్లామర్ ప్రపంచంగా కొనియాడే సినీ ఇండస్ట్రీలో వెలిగిపోయే వారు ఎంతమంది ఉన్నారో, అనేక సాధకబాధకాలతో నలిగిపోతున్న వారు కూడా అంతేమంది ఉన్నారని చెప్పకతప్పదు. అందరికీ ఆదుకోవడం అసాధ్యం అయినప్పటికీ, కొంతమందిని ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామం.
గత కొన్ని నెలల క్రితం కమెడియన్ గుండు హనుమంతరావుకు మెగాస్టార్ ఆర్ధిక సహాయం చేసి ఆదుకున్న వైనం తెలిసిందే. తాజాగా ‘అల్లరి’ ఫేం సుభాషిణికి తన చిన్న కూతురు శ్రీజ ద్వారా రెండు లక్షల రూపాయల నగదును పంపి, తనలోని పెద్ద మనసును మరోసారి చాటిచెప్పుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
గత కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో సుభాషిణి బాధపడుతోందని తెలుసుకున్న చిరంజీవి, ఓ కవర్ లో రెండు లక్షల రూపాయలను పెట్టి ఆమె ఇంటికి పంపించారు. ఈ మొత్తంతోనే ఆమె కష్టాలు తీరకపోయినప్పటికీ, ఇండస్ట్రీ పెద్దగా తన వంతు సాయంగా చిరంజీవి స్పందించడంతో, సుభాషిణి కూడా మిక్కిలి సంతోషం వ్యక్తం చేసారు.



