లోపాలు సవరించుకోవడానికి మీడియా అద్భుతమైన సాధనమని సినీ హాస్య నటుడు సప్తగిరి అభిప్రాయ పడ్డారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా తన భావాలను వ్యక్తపరిచిన సప్తగిరి… “మీడియా లోపాలు ఎత్తి చూపుతుందని… అయితే ఆ లోపాలను సానుకూల దృక్పధంతో చూస్తే సవరించుకుంటామని, మీడియా ఎత్తి చూపింది అనుకుంటే మరో సమస్య ఉత్పన్నమవుతుందని” చాలా ప్రాక్టికల్ గా ఆలోచించాడు.
“తన నటన ఒకే తరహాలో ఉంటుందని మీడియా ఆరోపిస్తుందని, తాను నటనలో అనుభవం సంపాదించుకుని సినిమాల్లోకి రాలేదని, నటనలో ఓనమాలు కూడా తనకు తెలియవని అన్నాడు. ఇప్పుడిప్పుడే నటనలో నడక నేర్చుకుంటున్నానని చెప్పిన సప్తగిరి, మీడియా చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని అంగీకరించాడు. తన సినిమాలు నాలుగు చూస్తే అందులో వైవిధ్యం ఏమీ కనిపించదని, తాను కూడా దానిని అంగీకరిస్తానని చెప్పాడు. ఇప్పుడిప్పుడే తన నటనా విధానాన్ని మార్చుకుంటున్నానని” ఈ కమెడియన్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాడు.
బహుశా సప్తగిరి మాదిరి ఆలోచించే వారు సినీ పరిశ్రమలో బహు అరుదుగా ఉంటారని చెప్పవచ్చు. మీడియా వర్గాలు చాలా మంది సినీ సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ కధనాలు ప్రసారం చేస్తుంది. ఒక స్థాయికి వెళితే ఎంతగా ప్రశంసలు కురిపిస్తారో, లోపాలు ఉన్న సమయంలో అలాగే విమర్శలు కూడా చేస్తుంది. కానీ సాధారణంగా పొగడ్తలను స్వీకరించినంత తేలికగా విమర్శలను సినీ వర్గీయులు స్వీకరించరు అన్న విషయం తెలిసిందే. బహుశా కమెడియన్ సప్తగిరి మాత్రం దీనికి అతీతుడు అని నిరూపించుకుంటున్నాడు.



