ఇటీవలే జరిగిన ఎన్నికలలో జనసేన ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. జనసేన కేవలం ఒక్కే ఒక్క సీటు తన ఖాతాను తెరిచింది. తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. 137 సీట్లలో పోటీ చేస్తే 120 చోట్ల ధరావత్తు కోల్పోయారు ఆ పార్టీ అభ్యర్థులు. ఇక జనసేన మిత్రులకు కేటాయించిన సీట్ల గురించి అయితే మాట్లాడుకొనవసరం లేదు.
అయితే కమ్యూనిస్టులు తమ ఓటమిని జనసేనపైకి తోసే ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరి, కుప్పంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయకపోవడం వల్ల ప్రజలు జనసేన కూటమితో పాటు టీడీపీని నమ్మలేదు అని సిపిఐ నాయకులు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసిన పులివెందులలో కూడా ప్రచారం చెయ్యలేదు. మరి దాని గురించి మాట్లాడలేదు కదా? ఇది ఓటమి నెపం పవన్ కళ్యాణ్ మీదకు తోసేసే ప్రయత్నంలా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాట అటుంచితే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రభావం కోల్పోతున్నారు.
పశ్చిమ బెంగాల్ చెయ్యి జారి పోయింది. ఈశాన్య రాష్ట్రాలలో కూడా అధికారం లేకుండా పోయింది. కేరళలో కూడా ప్రమాదం పొంచి ఉంది. మరి దానికి కారణం ఏంటో? జనసేన ఈ ఎన్నికలలో ఓడిపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. అందులో టీడీపీని గట్టిగా విమర్శించలేకపోవడం ఒక కారణమైతే కమ్యూనిస్టులతో, మాయావతి పార్టీతో చేతులు కలపడం కూడా ఒక కారణమే. తమ ఓటమికి పవన్ కళ్యాణ్ ను నిందించడం మాత్రం దారుణం అనే చెప్పుకోవాలి.



