విజయ సాయిరెడ్డి, పురందేశ్వరి… ఈ గేమ్స్ ఏమిటో?

Daggubati-Purandeshwari-

వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి ఢిల్లీలో మోడీ, అమిత్ షాలతో రాసుకుపూసుకు తిరుగుతూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తుంటారు. అందుకు వారిరువురూ అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కూడా వారు పురందేశ్వరి సూచనలను పట్టించుకొన్నట్లు లేదు. కనుక మోడీ, అమిత్ షాలు ఆమెకంటే విజయ సాయిరెడ్డికి, జగన్మోహన్‌ రెడ్డిలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా?అనే సందేహం కలుగుతుంది.

ADVERTISEMENT

కానీ ఆమె అధిష్టానం సహకారం లేనప్పటికీ వైసీపి ప్రభుత్వంతో ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. నిజానికి అందుకే ఆమెకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించారు కూడా. ఆమె గత కొన్ని రోజులుగా వైసీపి ప్రభుత్వం మద్యం వ్యాపారాల పేరుతో కుంభకోణాలకు పాల్పడుతుండటం గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.

ఇంతకాలం విజయ సాయిరెడ్డి తనపై అనుచిత విమర్శలు చేస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకొని దగ్గుబాటి పురందేశ్వరి, హటాత్తుగా ఆయనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

విజయ సాయిరెడ్డిపై మొత్తం 33 చార్జ్ షీట్లు నమోదయ్యాయని, ఆ కేసులలో ఆయన పదేళ్లుగా బెయిల్‌పై బయట ఉంటూ నిబందనలను అతిక్రమిస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దగ్గుబాటి పురందేశ్వరి లేఖలో ఆరోపించారు. కనుక ఆయన బెయిల్‌ రద్దు చేసి కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు.

విజయ సాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలనుకొంటే కేంద్రానికి ఒక్క నిమిషం పట్టదు. కానీ పదేళ్ళుగా ఎటువంటి చర్య తీసుకోలేదు. పైగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో, రాజ్యసభలో కీలక పదవులు కట్టబెట్టింది కూడా. కనుక ఆయనకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న ఈ పోరాటాలు చూసి అందరూ జాలి పడుతున్నారు.

అయితే రాజకీయాలలో ఎవరూ శాస్విత మిత్రులు, శాస్విత శత్రువులు ఉండరు. కనుక జగన్, విజయ సాయిరెడ్డిలను కధ ముగించడానికే మోడీ, అమిత్ షాలు ఆమె ద్వారా ఈవిదంగా పావులు కదిపిస్తూ వారి కోసం రంగం సిద్దం చేస్తున్నారా?అనే సందేహం కూడా కలుగుతోంది.

ఎందుకంటే మోడీ, అమిత్ షాల అనుమతి తీసుకోకుండా ఆమె జగన్, విజయ సాయిరెడ్డిలపై ఆరోపణలు చేయరు. ఒకవేళ చేసినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాయరు కదా?కనుక విజయ సాయిరెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి ఆడుతున్న ఈ రాజకీయ చదరంగాన్ని మోడీ, అమిత్ షాలు ఏవిదంగా ముగిస్తారో చూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories