ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి కొద్ది రోజుల క్రితమే బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమింపబడ్డారు. 2019ఎన్నికల ఓటమి తరువాత రాజకీయంగా స్తబ్దుగా ఉన్న ఆమె ఉన్నఫళంగా రాజకీయంగా యాక్టీవ్ అయ్యారు. పురంధేశ్వరి జాతీయ నాయకురాలా? లేక జాతి నాయకురాలా అంటూ వివాదంలోకి లాగారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి.
తాజాగా ఆమె మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు… ఈసారి రాజకీయంగా కాదు. పురంధేశ్వరి కరోనా బారిన పడ్డారు. ఆమె వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
అయితే కొత్త బాధ్యతలు వచ్చిన వెంటనే వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు సమాచారం. పార్టీ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఆమెను అభినందించడానికి నాయకులు, అనేకమంది కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి పురంధేశ్వరిని కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు అనుమానం.
అలాగే రెండు రోజుల క్రితం ఆమె ఢిల్లీ వెళ్లి వచ్చారు. అనారోగ్యంగా ఉండడంతో ఆమె పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ వచ్చింది. దీంతో వెంటనే ఆమె హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.




