“భవిష్యత్తులో తానూ పెద్ద హీరోలతో సినిమాలను నిర్మించలేనేమోనని, ఒకప్పుడు దర్శకుడు తయారు చేసుకుని వచ్చిన కథే మూలాంశంగా, హీరో అందులో భాగంగా ఉండేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందని, చిన్న హీరోలు సైతం మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి నిర్మాణంలో తమ పాత్ర వుండాలని కోరుతున్నారని, హీరోల ప్రమేయం అధికం కావడం పరిశ్రమకు అంత మంచిది కాదని” దర్శకరత్న దాసరి నారాయణరావు అభిప్రాయ పడ్డారు.
అయితే ముందుగా అనుకున్నట్టు పవన్ కల్యాణ్ తో మాత్రం ఒక సినిమాను నిర్మిస్తానని, ఆ సినిమా కధ పొలిటికల్ సెటైర్ గా మాత్రం ఉండబోదని, సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ చిత్రంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ గ్రేట్ ఓ కమిట్ మెంట్ ఉన్న వ్యక్తని, తానేమనుకున్నా చేస్తాడని, అలాగే మానవతా దృక్పథంతో వ్యవహరిస్తాడని, తన చిత్రం ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లకు కొంత డబ్బు తిరిగి ఇస్తానని తనంతట తానుగా వెల్లడించిన మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసలు కురిపించారు.
పవన్ ను పొగుడుతూ దాసరి చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నా… పవన్ ను అర్ధం చేసుకోవడం దాసరి ‘పప్పులో అడుగేసారని’ సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సినిమా నిర్మాణాలలో హీరోల ప్రమేయం ఎక్కువగా ఉంటుందని ఆవేదనపడ్డ దాసరికి, పవన్ కళ్యాణ్ గురించి తెలియదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లో పవన్ వ్రేలు పెడతారని ట్రేడ్ వర్గాల్లో తెలియని వారుండరు.
నిజానికి పవన్ కళ్యాణ్ తోనే ఈ పోకడ మరింత ఎక్కువైందన్న ప్రచారం సినీ ఇండస్ట్రీలో ఉంది. సినిమాకు సంబంధించిన డైరెక్షన్, మ్యూజిక్, డైలాగ్స్, కొరియోగ్రఫీ, ఫైట్స్… ఇలా ఒకటేమిటి పవన్ తలదూర్చని విభాగం లేదని… ఇంకా చెప్పాలంటే ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ద్వారా మరోసారి పవన్ తానేమి చేయగలను అనేదాన్ని నిరూపించారని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.
మరి అలాంటి పవన్ తోనే సినిమా చేస్తూ…. హీరోల ప్రమేయం ఎక్కువైపోయిందని, అలాంటి హీరోలతో పని చేయలేనని చెప్పడం ఎంతవరకు సమంజసమో దాసరి గారే ఆలోచించుకోవాలి. పవన్ సినిమాల దర్శకుల జాబితాను పరిశీలిస్తే… ఎక్కడా అగ్ర దర్శకుల పేర్లు వినపడవు, కనపడవు. దానికి కారణం కూడా పవన్ ప్రమేయమే అన్నది సినీ ఇండస్ట్రీ జనాల మాట. దాసరి నిర్మించబోయే సినిమాకు కూడా ఓ వర్ధమాన దర్శకుడు పేరే చివరకు వినిపించవచ్చన్నది అభిమానులు సైతం అంగీకరించే వాస్తవం.



