ఢిల్లీ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు మట్టికరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు ఆదిలోనే డికాక్ (1) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ (19) కాసేపు మెరిసినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాడు. అనంతరం వచ్చిన సంజు శాంసన్ (60) దూకుడుగా ఆడగా, డుమిని (49) పరుగులతో చక్కని సహకారం అందించగా, కరణ్ నాయర్ (5) విఫలమయ్యాడు. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు 9 పరుగుల వద్ద పార్థివ్ పటేల్ (1) వికెట్ కోల్పోయింది. అనంతరం అంబటి రాయుడు (25) తో కలసి ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, అమిత్ మిశ్రా వేసిన బంతికి పెవిలియన్ చేరిన రాయుడు తరువాత వచ్చిన కునాల్ పాండ్య (36) ధాటిగా ఆడాడు. సమన్వయ లోపంతో రనౌట్ గా వెనుదిరిగాడు.
ఆదుకుంటాడనుకున్న బట్లర్ (2) విఫలమవ్వగా, పొలార్డ్ (19) భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. అలాగే, హార్డిక్ పాండ్య (2) రనౌట్ కాగా, హర్భజన్ (0) విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీయగా, జహీర్, మోరిస్ చెరోవికెట్ తీశారు. రనౌట్లు కొంప ముంచడంతో చివరి వరకు క్రీజులో ఉన్న రోహిత్ శర్మ జట్టును గెలిపించలేకపోయాడు.





