దాదాపు రెండు వారాలుగా సముద్రంలో ఆచూకీ తెలియకుండాపోయిన కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత క్షేమంగా ఇళ్ళకు చేరుకున్నారు. దీంతో వారి కథ సుఖాంతం అయ్యింది.
జిల్లాలోని కొత్తపల్లి మండలం సుబ్బంపేటకు చెందిన వీరి కోసం గత రెండు వారాలుగా కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలిస్తూనే ఉన్నారు. కానీ వారి ఆచూకీ లభించలేదు.
ఆ ఏడుగురు మత్య్సకారులు నవంబర్ 4న ఉప్పాడ వద్ద నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. నవంబర్ 10న విశాఖ హార్బర్‌కు చేరుకుని అక్కడ చేపలను విక్రయించి అదే రోజు రాత్రి మళ్ళీ సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు.
చివరిసారిగా నవంబర్ 14న తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత వారి ఫోన్లకు సిగ్నల్ అందకపోవడంతో పని చేయలేదు.
అయితే ఇది వారికీ, వారి కుటుంబ సభ్యులకు మామూలే కనుక మొదట ఎవరూ ఆందోళన చెందలేదు. కానీ రెండురోజులు గడిచినా వారి ఫోన్లు, బోటులోని ‘శాటిలైట్ ట్రాన్స్‌పాండర్’ సిగ్నల్స్ కూడా అందకపోవడంతో ఒక్కసారిగా అందరిలో ఆందోళన మొదలైంది. దీంతో నవంబర్ 19న కుటుంబ సభ్యులు కోస్ట్ గార్డ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా వారి ఆచూకీ కనుగొనాలని గట్టిగా ఒత్తిడి చేసినప్పటికీ కోస్ట్ గార్డ్ సిబ్బంది వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
అయితే వారిని ఒడిశాలోని పారాదీప్ సమీపంలో చూసినట్లు వేరే మత్స్యకారులు సమాచారం అందించడంతో ఆ ప్రాంతంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చేపట్టారు. కానీ అక్కడా వారి ఆచూకీ లభించలేదు. ఎందువల్లనంటే, వారు పాడైన తమ బోట్ ‘గేర్ బాక్స్’ తాత్కాలికంగా మరమత్తు చేసుకొని, అప్పటికే మళ్ళీ కాకినాడ వైపు బయలుదేరారు గనుక.
గురువారం సాయంత్రం 4.30 గంటలకు బోటులో ఉన్న సిబ్బంది ఫోన్లకు సిగ్నల్ లభించడంతో వారు వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పి, తామందరం క్షేమంగా ఉన్నామని కొన్ని గంటల్లో ఇళ్ళకు చేరుకుంటామని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కోస్ట్ గార్డ్ సిబ్బందికి కూడా వారు తాము అనకాపల్లి-కాకినాడకు మధ్య ఉన్నామని చెప్పి, లొకేషన్ షేర్ చేయడంతో, కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని వారికి ఎస్కార్ట్ ఇచ్చారు. గురువారం రాత్రి సుమారు 11 గంటలకు వారందరూ కాకినాడలోని ఉప్పాడ తీరం చేరుకున్నారు.
మత్స్యశాఖ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లకు వారి క్షేమ సమాచారం అందించడంతో అందరూ క్షేమంగా ఇళ్ళకు చేరుకున్నందుకు వారూ చాలా సంతోషించారు.





