తమ అభిమాన హీరోని అతి దగ్గరగా, అందరి కంటే ముందుగా తామే చూడాలన్న ఆకాంక్షతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూపించిన అత్యుత్సాహం “దేవర” ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తానికే ఎసరు తెచ్చిపెట్టింది. దీంతో ‘అసలుకే మోసం’ వచ్చి ఈవెంట్ మొత్తాన్ని నిర్వాహకులు రద్దు చేశారు.
కేవలం నాలుగైదు వేల మంది సరిపోయే ప్రదేశంలో, లెక్కకు మించిన పాస్ ల పంపకాలు, “ఆర్ఆర్ఆర్” అపూర్వ విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో రెట్టింపు ఉత్సాహంలో ఉన్న అభిమానులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అదే తంటాలు తీసుకువచ్చి ఏకంగా తమ అభిమాన హీరో దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు.
ఇక్కడ అభిమానులు ఒక్కరిదే తప్పు కాదు, నిర్వాహకుల లోపం కూడా స్పష్టంగా కనపడుతోంది. పాస్ ల పంపకాల విషయంలో చూపించిన అలసత్వం స్పష్టంగా కనపడుతోంది. పరిమిత సంఖ్యలో జరగాల్సిన కార్యక్రమానికి అపరిమితంగా జరిపిన పాస్ ల పంపకాలు తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
అయితే ఇది ఇక్కడితో అయిపోతుందనుకుంటే పప్పులో కాలేసినట్లే! అభిమానులు అదుపులోకి రాక రద్దు చేసిన కార్యక్రమాన్ని విడుదల లోపు మళ్ళీ ఖచ్చితంగా చిత్ర యూనిట్ నిర్వహిస్తుంది. అప్పుడైనా సరైన ప్లానింగ్ తో చేయలేని పక్షంలో మరోసారి భంగపాటుకు గురికావాల్సి ఉంటుందని చిత్ర యూనిట్ తెలుసుకోవాలి.
‘ఫియర్’ సాంగ్ తో వచ్చిన ఊపుని కొనసాగించడంలో రెండు ట్రైలర్స్ సఫలీకృతం కానప్పటికీ, సినిమాలో కొరటాల ఇంకా ఏదో సస్పెన్స్ దాచి ఉంచారనే ఆశతో అభిమానులు ఉన్నారు. గతంలో తారక్ కూడా ‘అభిమానులు కాలర్ ఎగరుసుకునే విధంగా’ సినిమా ఉండబోతోంది అని ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ లో నింపిన వైనం తెలిసిందే.
అన్నీ అనుకున్నట్టు ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి ఉంటే కొరటాల – ఎన్టీఆర్ ల స్పీచ్ లు ఫ్యాన్స్ కు మరింత కిక్ ని పంచేవి. ఇంకా విడుదలకు నాలుగు రోజులే మిగిలి ఉండడంతో ప్రీ రిలీజ్ వేదిక ఎప్పుడు, ఎక్కడ ఉండబోతోంది అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.




