విడుదల చేసిన రెండు ట్రైలర్స్ సినీ ప్రేక్షకులకు పెద్దగా రుచించకపోయినప్పటికీ, “దేవర” ప్రీ రిలీజ్ బుకింగ్స్ మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో నాన్ – బాహుబలి రికార్డులను అందుకునే దిశగా రిలీజ్ కు ముందు “దేవర” టికెట్లు తెగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ప్రమోషన్స్ విభాగంలో బాగా వీక్ గా కనపడుతున్నప్పటికీ, భారీ హైప్ రావడం ఓపెనింగ్స్ కు దోహదం చేస్తుంది. ఇదే ఊపులో ‘కంటెంట్’ గనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ‘పుష్ప’ మాదిరి ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతాడు ఈ ‘దేవర.’
మొత్తం అయిదు భాషలలో విడుదల కాబోతున్న “దేవర”కు తెలుగు, హిందీలతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ వారం పెద్దగా పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం. ఈ వీకెండ్ తో పాటు తదుపరి వారం నుండి దసరా పర్వదినం సెలవులు కావడంతో బాక్సాఫీస్ వద్ద “దేవర” దూకుడుకు అదుపు ఉండకపోవచ్చు.
అయితే కావాల్సిందల్లా ‘పాజిటివ్’ టాక్! ప్రీమియర్ షోస్ నుండి ఆ ఒక్కటి గనుక వస్తే, బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన రికార్డులను “దేవర” అందుకుంటాడని చెప్పడంలో సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అర్ధరాత్రి షోస్ కు అనుమతులు రావడంతో, అభిమానులు బెనిఫిట్ షోలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
‘క్లైమాక్స్’లో తదుపరి పార్ట్ కు సంబంధించిన ట్విస్ట్, సస్పెన్స్ ఉంటుందని దర్శకుడు కొరటాల శివ ఇచ్చిన హింట్, ‘బాహుబలి’ రేంజ్ లో వర్కౌట్ అయితే, “దేవర” గట్టెక్కినట్లే. శ్రీదేవి తనయురాలు జాహ్నవి కపూర్ తెలుగులో నటిస్తోన్న మొదటి సినిమా కావడంతో, టాలీవుడ్ కూడా ఈ ‘యువరాణి’ ఎంట్రీ కోసం వేచిచూస్తోంది.
‘ఆయుధ పూజ’ పాట ఒక్కటే విడుదలకు మిగిలి ఉన్న ప్రమోషన్ మెటీరీయల్. ట్రైలర్స్ ఇవ్వలేని కిక్ ను ‘ఆయుధ పూజ’ సాంగ్ ఇవ్వగలిగితే, అభిమానులకు, ప్రేక్షకులకు దసరా పండగ రెండు వారాల ముందే వచ్చినట్లే!




