కోలీవుడ్‌లో ప్రముఖ నటుడు విజయ్ దళపతి టీవీకే పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి కాగలిగారు. ఇది దేశంలో చాలా మందికి స్ఫూర్తి కలిగించింది.
ఇప్పుడు మరో హీరో ధనుష్ కూడా కొత్త పార్టీతో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అయన ‘తమిళగ ఎళుచ్చి కళగం’ అనే పేరును కేంద్ర ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
అయితే ధనుష్ రాజకీయ ప్రవేశానికి ఇది సరైన సమయమేనా?అంటే కాదనే అనిపిస్తుంది. ఆయన కూడా ఎన్నికలకు రెండేళ్ళ ముందు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని, దాంతో ప్రజల మధ్యకు వచ్చి ఉంటే, ఈపాటికి తాడోపేడో తేలిపోయేది.
కానీ ఎన్నికలు ముగిసి సాటి నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ధనుష్ కొత్త పార్టీ ఏర్పాటు చేసుకునట్లయితే ఐదేళ్ళు ఎదురుచూడాలి. పార్టీని నిర్మించుకొని బలోపేతం చేసుకోవడానికి చాలా సమయం లభిస్తుంది. కానీ ఐదేళ్ళపాటు పార్టీ నిర్వహణ ఖర్చులు భరించడమే చాలా కష్టం.
ముఖ్యంగా సిఎం విజయ్ పనితీరు, పాలన బాగున్నా లేకపోయినా ఆ ప్రభావం ధనుష్ పార్టీపై కూడా తప్పక పడుతుంది.
సిఎం విజయ్ ఇంత అద్భుతంగా పాలిస్తున్నప్పుడు మరో హీరో మాకెందుకు అనుకోని ధనుష్ పార్టీని పట్టించుకోకపోవచ్చు.
ఒకవేళ విజయ్ పాలన సరిగ్గా లేకపోతే, ఆయనతో చేసిన ఈ ప్రయోగం చాలు. మళ్ళీ ధనుష్ తో మరో ప్రయోగం అవసరం లేదనుకుంటే తమిళ ప్రజలు మళ్ళీ డీఎంకే, అన్నాడీఎంకేలవైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
కనుక ఒకవేళ ధనుష్ ఈ సమయంలో కొత్త పార్టీ ఏర్పాటు చేసినట్లయితే ఇది చాలా రాంగ్ టైమింగ్ అని చెప్పక తప్పదు.





