గత కొన్నాళ్ళుగా జగన్ అక్రమాస్తుల కేసులలో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యక్తిగత హాజరు నుండి జగన్ కు మినహాయింపు నుండి మొదలైన ఈ ప్రక్రియలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై విచారణ నిలిపి వేయాలని, ఈ కేసులతో వారికి ఎలాంటి సంబంధం లేదని, స్వయంగా కోర్టులు ధృవీకరించాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తాజాగా జరిగిన విచారణలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో కీలక మంత్రులుగా కొనసాగిన ధర్మాన ప్రసాదరావు, జె.గీతారెడ్డిలకు ఊరట లభించింది. వీరిద్దరికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ధర్మాన, గీతారెడ్డిలతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి శామ్యూల్స్ కు కూడా కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
అయితే వరుసగా ఏర్పడుతున్న ఈ పరిణామాలు దేనికి సంకేతాలు? అన్న చర్చ మొదలైంది. సుదీర్ఘంగా విచారణ జరుగుతున్న కేసులు నీరుగారిపోయే ప్రక్రియ జరుగుతోందా? అన్న సందేహాలకు తావిచ్చేలా ఉదంతాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం కేసుల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుండడంతో జగన్ కేసులకు క్లైమాక్స్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.





