‘డిక్టేటర్’ ఆడియో వేడుక జరిగి దాదాపు 20 రోజులు గడిచాయి. ఈ వేడుక ఎలాంటి సంచలన విషయాలకు తావు లేకుండా జరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే దీని తర్వాత నిర్వహించిన “నాన్నకు ప్రేమతో” సినిమా ఆడియో వేడుక పలు వివాదాలకు, సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలిచి ఆడియన్స్ ఆసక్తితో పాటు, ప్రీ పబ్లిసిటీని రాబట్టుకొంది. అంతే కాదు, ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుక అనేది నందమూరి వర్గాల్లో ఉన్న చీలికను స్పష్టంగా బయటపెట్టింది.
దీంతో దీనికి కౌంటర్ ఇవ్వడానికి బాలయ్య వర్గం సిద్ధమైందని, దానికి వేదికగానే “డిక్టేటర్” ప్లాటినం డిస్క్ వేడుకలను నిర్వహిస్తున్నారని ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా సాగుతున్న ప్రచారం. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు (జనవరి 9వ తేదీన) ప్లాటినం డిస్క్ వేడుకలను సిద్ధం చేసారని టాక్. “నాన్నకు ప్రేమతో” విడుదల తేదీని ప్రకటించిన రోజునే “డిక్టేటర్”కు మరో వేడుక నిర్వహించడం ఈ వార్తలకు బలం చేకూరుతోంది.
మరి “డిక్టేటర్” ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక మరెన్ని సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి. ఎస్.ఎస్.తమన్ అందించిన ఈ సినిమా ఆల్బమ్ పర్వాలేదనిపించేదిగా పేరు తెచ్చుకుంది. “డిక్టేటర్” సినిమా జనవరి 14వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.





