rakesh-varre

ఆస్కార్ స్థాయికి ఎదిగి, పాన్ ఇండియా మూవీలతో కళకళలాడిపోతున్న మన తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాల కష్టాలు ఎవరికీ పెద్దగా పట్టవు. ఎందుకంటే, ప్రేక్షకులు, సినీ మీడియా అందరి దృష్టి ఎప్పుడూ పెద్ద హీరోలు, పెద్ద సినిమాలపైనే ఎక్కువగా ఉంటుంది కనుక. అందరూ వాటికే ప్రాధాన్యం ఇస్తారు కనుక!

చిన్న సినిమాల దర్శక నిర్మాతలు, నటీనటులు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఓ సమస్యని నేడు విడుదలైన ‘జితేందర్ రెడ్డి’ సినిమాలో హీరోగా చేసిన రాకేష్ వర్రే బయటపెట్టారు.

Also Read – కూటమి ప్రభుత్వం: పాత సినిమా రీ-రిలీజ్?

తన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ, “ఈ విషయం నేను పేకమేడలు సినిమా నిర్మించిన అనుభవంతో చెపుతున్నా. ఆ సినిమాతో నేను ఏదో చెప్పాలనుకున్నాను. కొత్తవాళ్ళని ప్రమోట్ చేయాలనుకున్నాను. పేక మేడలు చిన్న సినిమాయే అయినా దానిని పూర్తి చేయడానికి మాకు మూడేళ్ళు పట్టింది. అదే… మాకూ ఓ బ్రాండ్, ఓ గుర్తింపు ఉండి ఉంటే ఏడాదిన్నరలోనే పూర్తయిపోయేది.

కనుక ఎవరికి వారు ఓ స్థాయికి ఎదిగి గుర్తింపు సంపాదించుకునే వరకు ఇటువంటి ప్రయోగాలు చేసి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. నాలాగ ఎవరూ బాధపడొద్దు.

Also Read – “పుష్ప 2” క్రేజ్… ప్రేక్షకుల ముఖచిత్రమేమిటి..?

ఏ సినిమా ఫంక్షన్‌కైనా సెలబ్రేటీలు ముఖ్య అతిధులుగా వస్తేనే మీడియా కవరేజ్ లభిస్తుంది. లేకుంటే ఆ సినిమాని ఎవరూ పట్టించుకోరు. ఇండస్ట్రీలో మా వంటి చిన్న సినీ నటులు, నిర్మాతలకు ఇది శాపంగా మారింది.

కనుక మేము కూడా మా ఈ కార్యక్రమం కోసం సెలబ్రేటీలను రప్పించేందుకు చాలా ప్రయత్నించాము. ఈ కార్యక్రమం మొదలయ్యేవరకు కూడా మేము వారికి ఫోన్లు చేస్తూనే ఉన్నాము. మెసేజ్‌లు పెట్టి రమ్మనమని పిలుస్తూనే ఉన్నాము. కానీ రాలేదు.

Also Read – వర్మ సినిమాలకు జగన్‌ పెట్టుబడి: క్విడ్ ప్రోయే కదా?

రారు… ఎందుకంటే వారు ఏదైనా కమిట్‌మెంట్ ఉంటేనే వస్తారు లేదా ఎవరైనా స్నేహితుడో బందువో ఉంటేనే వస్తారు. ఊరికే రమ్మంటే ఎవరూ రారు. ఇది పచ్చి నిజం.

కనుక ఇండస్ట్రీలో నా మిత్రులందరికీ ఒకటే చెపుతున్నా. సెలబ్రేటీల కోసం ఎదురుచూడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయండి. డిస్ట్రిబ్యూటర్లే మనకు ముఖ్యం. కనుక వారితో కూర్చొని అన్నీ మాట్లాడుకోండి. మార్కెటింగ్ మీద దృష్టి పెట్టండి. మీ సినిమాని మీరే ప్రమోట్ చేసుకోండి,” అంటూ రాకేష్ వర్రా ఆవేశంగా అన్నారు.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మరో కార్యక్రమంలో దీనిపై స్పందిస్తూ, “చిన్న సినిమా ఈవెంట్‌లకు సెలబ్రేటీలు రారంటూ రాకేష్ చాలా బాధపడ్డాడు. అవును రారు. ఎందుకంటే ఎవరి బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్ వారికుంటుంది. సినీ పరిశ్రమలో ఎవరికి ఎవరూ తోడ్పడరు.

కనుక మన టాలెంట్ మనమే నిరూపించుకోవాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసి ప్రజలను మెప్పించడానికి ప్రయత్నించాలి. సినిమా బాగా తీసి గుర్తింపు తెచ్చుకుంటే ఇంక ఏ సెలబ్రేటీ అవసరమూ ఉండదు,” అని దిల్‌రాజు చెప్పారు.




రాకేష్, దిల్‌రాజు చెప్పిన వెర్షన్స్ భిన్నంగా ఉన్నట్లనిపిస్తున్నప్పటికీ ఇద్దరూ చెప్పింది ఒక్కటే అని అర్దమవుతోంది. కానీ చిన్న సినిమా దర్శక నిర్మాతలు, హీరోలు తమ సినిమా తీయడానికి, ప్రమోట్ చేసుకొని విడుదల చేసుకోవడానికి పడుతున్న పురిటి నొప్పులు భరించడం ఎంత కష్టమో రాకేష్ చక్కగా చెప్పగలిగాడు.