టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అని చెప్పగానే టక్కున జ్ఞప్తికి వచ్చే పేరు దిల్ రాజు. కధల ఎంపికలో దిల్ రాజు పెట్టే శ్రద్ధ వలనే, అన్ని సక్సెస్ లు సొంతమవుతున్నాయనేది ఇండస్ట్రీ టాక్. ముఖ్యంగా కుటుంబ విలువలతో కూడిన సినిమాలను నిర్మించడంలో దిల్ రాజుది అందె వేసిన చేయి. అలాంటి దిల్ రాజు తన 25వ సినిమాగా అల్లు అర్జున్ తో “దువ్వాడ జగన్నాధమ్” వంటి కమర్షియల్ సినిమాను నిర్మిస్తున్నారు.
జూన్ 23వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఇటీవలే ముగించిన విషయం తెలిసిందే. తన సినిమాల దర్శకులందరినీ పక్కన పెట్టుకుని విడుదల చేసిన ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో… దిల్ రాజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. “తన జీవితంలో ఎప్పుడూ దర్శకత్వం జోలికి వెళ్లనని, ఒక సినిమాను తెరకెక్కించడానికి దర్శకులు పడే శ్రమ తనకు తెలుసని, అందుకే అటు వైపు చూడనని” అన్నారు.
రేయింబవళ్ళు ఒక కధ కోసం అలా కూర్చుని కష్టపడుతూనే ఉంటారని, అది చూస్తే తనకు భయం వేస్తుందని, తాను అంతలా కష్టపడలేనని, అందుకే దర్శకత్వ ఆలోచనలు తనకు లేవని, అయితే నిర్మాతగా 25 సినిమాలు పూర్తి చేసిన తాను, వంద చిత్రాలను నిర్మిస్తానో లేదో ఇప్పుడే చెప్పలేను గానీ, ఖచ్చితంగా 50 సినిమాలైతే పూర్తి చేస్తానని అన్నారు. దర్శకత్వం చేయరు గానీ, డైరెక్టర్లకు అనేక సలహాలను మాత్రం దిల్ రాజు ఇస్తుంటారని టాక్.





