‘తలైవా’ రాజకీయ ప్రవేశం చేస్తున్నారన్న ఉద్దేశంతో ప్రముఖ దర్శకుడు భారతీరాజా చేస్తోన్న విమర్శలు తమిళనాట పెను కలకలం రేపుతున్నాయి. రజనీ రాజకీయ ప్రవేశంపై వ్యతిరేకత వ్యక్తం చేయడమే లక్ష్యంగా చెన్నై ప్రెస్ క్లబ్ లో కోలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్లు కొందరు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ… మే 17న మెరీనా బీచ్ లో ఈలం వార్ బాధితులకు నివాళిగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభను భగ్నం చేసి, ఆ ఉద్యమానికి ఆద్యుడైన తిరుమురుగన్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు.
తమపై ఎవరెవరో పెత్తనం చలాయించాలని చూస్తున్నారని, ప్రధానంగా తమిళులు కాని వారు తమపై పెత్తనం చలాయించాలని చూస్తున్నారని పరోక్షంగా రజనీకాంత్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. తమిళులకు మంచి నేతలు లేరని వారు చెప్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారొచ్చి తమని ఏలాలని చూస్తున్నారని మండిపడ్డారు. సరే వారు చెప్తున్నట్లే… తమిళులకు మంచి నేతలే లేరనుకుందాం. అలాంటప్పుడు వీరొచ్చి మాత్రం ఏం చేస్తారు? అని ప్రసంగం ఆద్యంతం రజనీని టార్గెట్ గా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేసారు.
అంతే కాకుండా… వారు అలా అనడం ఎలా ఉందంటే… భార్య గర్భవతి కాలేదని బాధపడుతున్న వాడితో నీ బిడ్డకు తండ్రిగా ఉంటానని అడుగుతున్నట్టు ఉందని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. దానికి కొనసాగింపుగా, ఏ విషయంలో అయినా భాగం అడగొచ్చు, కానీ పడకలోనూ భాగం కావాలని డిమాండ్ చేస్తే ఎలా ఇస్తామంటూ కాస్త శృతిమించారు. భారతీరాజా అలా పచ్చిగా మాట్లాడే సరికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. విమర్శలు ఎవరైనా చేయవచ్చు కానీ మరీ ఇంత నీచమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని సూపర్ స్టార్ అభిమానులు, కోలీవుడ్ వర్గాలు కామెంట్స్ చేస్తున్నారు.



