మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించబోయే సినిమాలో లుక్ పై స్పష్టత వచ్చేసింది. ‘బ్రహ్మోత్సవం’ విడుదల తర్వాత లండన్ పయనమైన ప్రిన్స్, ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమాలో ప్రిన్స్ గడ్డం పెంచుకున్నారన్న విషయం సోషల్ మీడియాలో లీక్ అయిన పలు ఫోటోలు స్పష్టం చేసాయి. అయితే ఆ ఫోటోలు సైడ్ యాంగిల్ లో ఉండడంతో, స్పష్టమైన ప్రిన్స్ లుక్ మాత్రం ఎవరికీ కనపడలేదు.
అయితే మరికొద్ది రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలలో మునుపటి మాదిరే గడ్డం లేకుండా క్లీన్ షేవ్ తో దర్శనమిచ్చారు ప్రిన్స్. దీంతో మహేష్ కొత్త లుక్ పై అభిమానుల్లో సంగ్దిదత నెలకొంది. కానీ, తాజా సమాచారం మేరకు ప్రిన్స్ మేకోవర్ తధ్యమని, ఈ నెల 29 నుండి ప్రారంభం కాబోయే ఈ సినిమాలో మహేష్ లైట్ గా గడ్డం పెంచుకుని నటించబోతున్నారనే వార్తలను సినీ వర్గాలు అందిస్తున్నాయి. ఈ లుక్ వెనుక ముంబై స్టైలిష్ డిజైనర్ ఒకరు ఉన్నారని కూడా ఖరారయ్యింది.
లండన్ పర్యటనకు వెళ్ళిన తొలినాళ్ళల్లో ట్రయిల్ బేస్ గా కాస్త గడ్డం పెంచుకున్నారని, ఈ లుక్ తో మురుగదాస్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసి ఓకే చెప్పడంతో తర్వాత మళ్ళీ మహేష్ మార్చేశారని, ఇపుడు మళ్ళీ గడ్డం పెంచే పనిలో ఉన్నారని సమాచారం. మరో రెండు వారాల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ కొత్త గెటప్ మాత్రం అభిమానులందరికీ ఆసక్తికరంగా మారింది.



