ఒకప్పుడు ఏ పేరైతే బాక్సాఫీస్ ను గడగడలాడించిందో, గత కొన్ని సంవత్సరాలుగా అదే పేరు వెలవెలబోతోంది. ‘నిజం’ సినిమాతో మొదలైన పరాజయాల పరంపర మొన్నటి ‘హోరాహోరి’ వరకు నిరంతరాయంగా కొనసాగింది. గత కొంతకాలంగా తన లేటెస్ట్ సినిమాపై బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్న తేజ, ఎట్టకేలకు సెట్ చేసుకున్నారన్న సమాచారం హల్చల్ చేస్తోంది.
‘భళ్ళాలదేవుడు’ రానా హీరోగా కాజల్ అగర్వాల్, కేథరిన్ థెరిసా హీరోహీరోయిన్లుగా “చరిత్ర” పేరుతో తెరకెక్కించనున్నారని సమాచారం. అలాగే ఇండస్ట్రీకి తానూ పరిచయం చేసిన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించే బాధ్యతలను తీసుకున్నట్లుగా టాక్. నిర్మాత తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
‘బాహుబలి’ సినిమా తర్వాత రానా క్రేజ్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగింది. నిజానికి ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ కంటే రానాకే ఎక్కువ పేరు వచ్చింది. దీంతో అటు ట్రేడ్ వర్గాలలోనే కాక, ప్రేక్షకుల మదిలోనూ విలక్షణ నటుడిగా రానా తనదైన ముద్ర వేయగలిగారు. దీంతో తేజ + రానా కాంభినేషన్ ఆసక్తికరంగా మారింది.



