Pawan Kalyan

“పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లల్లో మొత్తంగా జయకేతనం ఎగురవేస్తే మనం ఇప్పుడు చేసుకోవాల్సింది సంబరాలు కాదు, అంత బాధ్యతను ప్రజలు మన మీద పెట్టారనే భయం నిత్యం మనలో ఉండాలని” గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో చెప్పారు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్.

ఎన్డీయే సమావేశంలో భాగంగా ఢిల్లీ వెళ్లే ముందు మీడియా సమక్షంలో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే, ఒక ఎమ్మెల్యే ఇలా ఆలోచిస్తారా? నిజంగా ఇంత నిబద్ధతో ఉంటారా? అంటే ఎవరి సంగతి ఏమో గానీ, పవన్ కళ్యాణ్ మాత్రం దేశంలోనే ఓ ‘ఐకానిక్’ ఎమ్మెల్యేగా నిలవబోతున్నారన్న సంకేతాలను ఇస్తున్నారు.

Also Read – మూడు పార్టీల కథ…ముగ్గురి వ్యక్తుల వ్యధ..!

జగన్ మాదిరి తాను 1 రూపాయి జీతం తీసుకోబోనని, ఒక ఎమ్మెల్యేకు ఎంత జీతం వస్తుందో దానిని సంపూర్ణంగా తీసుకుంటానని, అలా తీసుకున్నప్పుడే అది ప్రజల ముచ్చెమటలతో కూడిన ధనాన్ని తానూ తీసుకుంటాను, అది నిరంతరం నన్ను వెన్నాడుతూ ఉంటుందని, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల సమక్షంలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

అలా తీసుకున్న జీతానికి పది రెట్లు మళ్ళీ వారికే ఏదొక రూపంలో ఇచ్చేస్తాను గానీ, నా ఎమ్మెల్యే జీతమైతే పూర్తిగా తీసుకుని ప్రజల కోసం కష్టపడి పని చేస్తానని ఎంతో ప్రీతిపాత్రంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో 1 రూపాయి జీతం తీసుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చేసిన అవినీతి, అరాచకం గురించి మననం చేసుకోవడం ప్రజల వంతవుతోంది.

Also Read – వ్యవస్థలకి జగన్‌ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!

పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాటలు బహుశా సినిమాలలోనే చూస్తాము తప్ప, నిజ జీవితంలో చెప్పేవారు గానీ, ఆచరించే వారు ఏ ఒక్క ఎమ్మెల్యే మచ్చుకైనా కానరారు. ఈ సందర్భంలోనే తన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలన్న హెచ్చరికలను కూడా పరోక్షంగా చెప్పకనే చెప్పారు. దీనితో పవన్ నాటి రాజకీయాలను మార్చబోతున్నారా అనే చర్చ మొదలయ్యింది.

జనసేన తరపున గెలిచిన ఇద్దరు ఎంపీలను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేసారు పవన్. పార్లమెంటుకు వెళ్లడమంటే పరిచయాలు పెంచుకోవడం కాదు, రాష్ట్రంలో ఉన్న సమస్యలను లేవనెత్తి, వాటికి అనుగుణంగా పోరాటం చేయాలని మొదటిసారిగా గెలిచిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరియు సీనియర్ నేత బాలశౌరిలకు హితబోధ చేసారు.

Also Read – కింగ్ అందుకుంటాడా.? శర్మ కొనసాగిస్తారా.?

ఒక పార్టీ అధినేతగా, పిఠాపురం ఎమ్మెల్యేగా మిగిలిన వారందరికీ ఓ “రోల్ మోడల్”లా పవన్ ఉండబోతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మాటల్లోనే కాక చేతల్లో కూడా ఇదే రకమైన అడుగులు పడితే దేశంలోనే “పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా” ఓ హాట్ టాపిక్ అయ్యే రోజు ఈ ఐదేళ్లల్లో ఖచ్చితంగా వస్తుంది.