తెలంగాణలో రాజకీయాలు మనకి అవసరమా?

Pawan Kalyan

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో కొండగట్టు ఆంజనేయస్వామివారిని దర్శించుకున్న తర్వాత, తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. శాసనసభ ఎన్నికలలోనే జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. కనుక ఇదేమీ కొత్త విషయం కాదనిపిస్తుంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఏదో యాదృచ్ఛికంగా ఈ ప్రకటన చేసిన్నట్లు భావించలేము.

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆకర్షించడం ద్వారా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కాస్త బలపడినప్పటికీ, తన ప్రభుత్వంపై ప్రజల ఏర్పరచుకున్న అంచనాలను నెరవేర్చలేక తడబడుతూనే ఉన్నారు.

ADVERTISEMENT

వరుస ఓటములు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కారణంగా తెలంగాణలో బిఆర్ఎస్ చాలా బలహీనపడింది. ఇదే సమయంలో బీజేపీ కాస్త పుంజుకుంది. కనుక తెలంగాణలో బీజేపీతో కలిసి ముందుకు సాగేందుకు ఇదే సరైన సమయమని పవన్‌ కళ్యాణ్‌ భావించి ఉండవచ్చు.

బహుశః బీజేపీ అధిష్టానమే పవన్‌ కళ్యాణ్‌కు ఈ సూచన చేసి ఉండవచ్చు. ఏపీలో పదేళ్ళపాటు పోరాటాలు చేసి అధికారంలోకి రాగలిగినప్పుడు తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి పోరాడితే అధికారంలోకి రాగలమనే నమ్మకం పవన్‌ కళ్యాణ్‌కు ఏర్పడి ఉండవచ్చు.

తెలంగాణలో కేసీఆర్‌ వంటి కుటిల రాజకీయ నాయకుడితో చేతులు కలపడం కంటే అధికార యావ లేని పవన్‌ కళ్యాణ్‌ వంటి నిజాయితీపరుడితో ముందుకు సాగడమే మంచిదని భావిస్తుండవచ్చు. కనుక బీజేపీ పెద్దల ప్రోత్సహాంతోనే పవన్‌ కళ్యాణ్‌ ఈ ప్రకటన చేసి ఉండవచ్చు.

ఎవరు అవునన్నా కాదన్నా అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తెలంగాణ సెంటిమెంట్ సజీవంగా ఉండేలా చేసి అది రాష్ట్ర రాజకీయాలను శాసించేలా కేసీఆర్‌ చేశారని చెప్పక తప్పదు. కనుక బీజేపీతో కలిసి పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో రాజకీయాలు చేస్తే ఏమవుతుంది?అంటే గుజరాతీలు, ఆంధ్రా వాళ్ళు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచేసుకోవడానికి వస్తున్నారంటూ కేసీఆర్‌ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి బలపడేందుకు అవకాశం కల్పించిన్నట్లవుతుంది.

ఇంతకాలం జగన్‌, వైసీపి నేతల అవహేళనలు భరించిన పవన్‌ కళ్యాణ్‌ ఇకపై మంచి మాటకారులైన కేసీఆర్‌, బిఆర్ఎస్ నేతల అవహేళనలు, అవమానాలు భరించాల్సి ఉంటుంది.

ఇక బీజేపీతో కలిసి తెలంగాణలో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలు చేయడం మొదలుపెడితే అది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి సవాలు విసిరిన్నట్లే అవుతుంది. కనుక రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు కూడా ఆత్మరక్షణ కోసం పవన్‌ కళ్యాణ్‌ని గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తారు. దీని వలన ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం ఉంటుంది.

ఇక ఏపీలో రాజకీయాలు, మంత్రిత్వ బాధ్యతలతోనే పవన్‌ కళ్యాణ్‌కి క్షణం తీరిక ఉండక సినిమాలు పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కూడా ప్రవేశిస్తే, తొలిసారిగా మంత్రిగా తనను తాను నిరూపించుకునే అపూర్వ అవకాశాన్ని వృధా చేసుకున్నట్లవుట్లు అవుతుంది. ఇప్పుడు నిరూపించుకోలేకపోతే వచ్చే ఎన్నికలలో ఆంధ్రా ప్రజలను ఓట్లు అడగలేరని మరిచిపోకూడదు.

కనుక అర్వింద్ కేజ్రీవాల్‌లా అత్యుత్సాహం ప్రదర్శించి కొత్త సమస్యలు కొని తెచ్చుకునే బదులు ఏపీలో తనను తాను నిరూపించుకునేందుకు పవన్‌ కళ్యాణ్‌ గట్టిగా ప్రయత్నిస్తే మంచిది. టిడిపికి కూడా ఇవే వర్తిస్తాయి.

ADVERTISEMENT
Latest Stories