‘మెగా’ సౌండ్ మెల్లిగా తగ్గుతుందా.?

కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అలియాస్ మెగా స్టార్ చిరంజీవి…’మెగా’ ను తన ఇంటి పేరుగా, తన కుటుంబ బ్రాండ్ గా మార్చుకున్నారు. హీరోల అభిమానులలో మెగా అభిమానులు వేరయా అన్న చందంగా ‘మెగా’ బ్రాండ్ వాల్యూ ని ఆ స్థాయికి చేర్చారు చిరంజీవి.

అయితే తన సినీ వారసత్వంతో ఇండస్ట్రీలోకి మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలుగా అరంగేట్రం చేసిన మాట అందరికి తెలిసిందే. అయితే ఇందులో తమ్ముడు పవన్ కళ్యాణ్, మేనల్లుడు అల్లు అర్జున్, కొడుకు రామ్ చరణ్ మినహియిస్తే మిగిలి వారంతా కూడా ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ చూడలేకపోయారు మెగా సౌండ్ చేయలేకపోయారనే చెప్పాలి.

ADVERTISEMENT

తన తరువాత ఇండస్ట్రీలోకి వచ్చిన నాగబాబు పడిలేస్తూ చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. అది కూడా అడపాదడపా అవకాశాలతోనే అని చెప్పాలి. అలాగే ఆయన కుమారుడు మెగా ఫామిలీ నుంచి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ ముకుందా తో అరంగేట్రం చేసినప్పటికీ ఫిదా, తొలి ప్రేమ మినహియించి మరేవీ మెగా హిట్ స్థాయికి చేరుకోలేదు. తాజాగా వచ్చిన మట్కా కూడా వరుణ్ ఆశలను మెగా అభిమానుల ఆకాంక్షను తీర్చలేకపోయింది.

ఇక చిరు సోదరి తనయుళ్ళుగా మెగా టాగ్ తో వచ్చిన సాయి దుర్గ తేజ్ అడపాదడపా హిట్స్ కొడుతూ విజయలకన్నా అపజయాలనే ఎక్కువగా ఎదుర్కొన్నారు. సాయి తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తరువాత సాయి నుండి సినిమా బయటకు రావడానికి చాల సమయమే పడుతుంది. సాయి సినీ అరంగేట్రం చేసి దశబ్దం పూర్తి కావస్తున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా సౌండ్ చేసిన సినిమా ఏది లేకపోవడం గమనార్హం.

అలాగే ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా మొదటి సినిమా ఉప్పెనతోనే 100 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకుని ఔరా అనిపించారు. అయితే ఇక ఆతరువాత వచ్చిన వైష్ణవ్ తేజ్ సినిమాలు ఎప్పుడు థియేటర్లలోకి వస్తున్నాయో, ఎప్పుడు ప్యాక్ అప్ చెపుతున్నాయో కూడా సగటు మెగా అభిమానికి సైతం తెలియకపోవడం ఇక్కడ కొసమెరుపు.

ఇక బన్నీ బ్రదర్ గా సినీ అరంగేట్రం చేసిన అల్లు శిరీష్ కూడా అప్పట్లో మెగా అనే టాగ్ తోనే వెండితెరకు పరిచయమయ్యారు, కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక వెనుతిరిగారు. ఇక అన్నను మించిన తమ్ముడిగా ఎదిగి తన స్థాయి వేరు తన స్థానం వేరు అంటూ రుజువు చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రంతో సినిమాలకు దూరంగా జరుగుతున్నారు.

ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నెరవేరుస్తున్న పవన్ రానున్న కాలంలో రాజకీయాల మీదే శ్రద్ద ఎక్కువ పెట్టే అవకాశం లేకపోలేదు. ముందుగా ఒప్పుకున్న హరిహర వీర మల్లు, OG , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను ముగించుకుని ఫుల్ టైం పొలిటిషన్ గా నిలబడనున్నారు పవన్.

దీనితో మెల్లిమెల్లిగా వెండి తెరకు ఈ మెగా సౌండ్ దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మెగా టాగ్ తో వచ్చి అల్లు బ్రాండ్ గా ఎదుగుతున్న అల్లు అర్జున్ కూడా మెగా సౌండ్ నుంచి దూరం జరుగుతూ అల్లు సౌండ్ చూపిస్తున్నారు. ఇక ఈ మెగా బ్రాండ్ కి పునాది వేసిన చిరు, ఆయన సినీ రాజకీయ వారసుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ మాత్రమే ఈ బ్రాండ్ ను కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్లాల్సి వస్తుందేమో మరి.

ADVERTISEMENT
Latest Stories