తర్వాత క్యూబాకి స్పాట్ పెడతాం: ట్రంప్‌

Donald Trump Global Wars

ఉక్రెయిన్‌తో నాలుగేళ్ళుగా యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధోన్మాది అనుకుంటే, ఆయన కంటే నేనేమీ తక్కువ కాదంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌.

ఏనుగుకి రెండు రకాల దంతాలు ఉంటాయి. ఒకటి బయటకు కనబడే పొడవాటి దంతాలు. రెండవది ఆహారం నమిలి తినేందుకు నోట్లో ఉండే దంతాలు. అందరూ ఏనుగు బయట దంతాలనే చూస్తారు. లోనివి కాదు.

ADVERTISEMENT

అలాగే ట్రంప్‌ కూడా ఒక్కో దేశంతో యుద్ధానికి ఒక్కో కుంటి సాకు చెపుతుంటారు. కానీ అసలు కారణం వేరే ఉంటుంది.

ట్రంప్‌ ముందుగా వెనెజువేలపైకి స్పాట్ పెట్టారు. దేనికంటే ఆ దేశం నుంచి అమెరికాకు భారీగా మాదకద్రవ్యాలు ఎగుమతి అవుతున్నాయని… వాటి వలన అమెరికన్ల జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు.

కానీ యుద్ధానికి ఈ సాకు సరిపోదు. కనుక ఆ దేశాధ్యక్షుడే స్వయంగా ఈ ముఠాలకు నాయకుడని ప్రకటించి తన దళాలను పంపించి ఆ దేశాధ్యక్షుడు, అయన భార్యని ఎత్తుకు వచ్చేశారు!

వెనెజువేలపై దాడికి అసలు కారణం ఆ దేశంలో అపారమైన చమురు సంపద, చమురు కంపెనీలను స్వాధీనం చేసుకోవడమే! అని వెనెజువేల చమురుని భారత్‌తో సహా పలు దేశాలకు సరఫరా చేయడం మొదలుపెట్టి నిరూపించుకున్నారు. అంటే అత్త సొమ్ము అల్లుడు కొట్టేసి దానం చేసినట్లన్న మాట!

వెనెజువేల తర్వాత ఇరాన్‌కి స్పాట్ పెట్టి బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం దేనికంటే అణ్వాయుధాలు తయారుచేయకుండా అడ్డుకోవడానికి అని చెప్పుకుంటున్నారు.

ఇదీ ఏనుగు దంతాల కధే అని అందరికీ తెలుసు. ఇరాన్‌ చమురు నిలువలు, ఆ దేశంలో అమెరికా సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడం వంటి ట్రంప్‌ చెప్పని కొన్ని స్టోరీలున్నాయి.

ఇరాక్ తర్వాత క్యూబా వంతు అని ట్రంప్‌ నిన్ననే ప్రకటించారు. క్యూబాతో యుద్ధం దేనికంటే దాని వలన అమెరికా భద్రతకు ముప్పు ఉంది కనుక అని మరో కొత్త స్టోరీ చెప్పారు. కానీ దీనికీ ఏనుగు దంతాల స్టోరీ ఉంది.

క్యూబాలో నిఖిల్, కోబాల్ట్, కొన్ని చమురు నిక్షేపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లోరిడాకు కేవలం 90 మైళ్ళ దూరంలో క్యూబా ఉంది. కనుక ఇక్కడ అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోగలిగితే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ జలసంధిపై పట్టు లభిస్తుంది.

వీటన్నిటి కంటే ముందు ‘గ్రీన్ ల్యాండ్’కి ముహూర్తం పెట్టారు. కానీ తెర వెనుక ఏదో జరగడం వలన ఇంకా స్పాట్ పెట్టలేదు. కానీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని ముందే చెప్పారు.

కానీ గ్రీన్ ల్యాండ్ కోసం మాత్రం ట్రంప్‌ ఏనుగు దంతాల స్టోరీ చెప్పకుండా “అక్కడ మా సైనిక అడ్డా పెట్టుకుంటాము. కనుక మేము తీసేసుకుంటాము,” అని నిర్మొహమాటంగా చెప్పేశారు.

ట్రంప్‌ లిస్టులో ఇంకెన్ని దేశాలున్నాయో తెలీదు కానీ ఏడూ దేశాల యుద్ధాలు ఆపి మరో ఏడు దేశాలతో యుద్ధాలు చేయబోతున్నారనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories