ట్రంప్‌కి ఇంట్లో ఈగల మోత.. కానీ బయట పల్లకీ మోత లేదే!

Donald Trump amid domestic and global criticism

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పది రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం సంగతి దేవుడెరుగు కనీసం తాను స్వయంగా ఇరాన్‌తో మొదలుపెట్టిన యుద్ధం కూడా ముగించే స్థితిలో లేరు.

వీకెండ్ పిక్నిక్‌ అంటూ మొదలుపెట్టిన యుద్ధం అప్పుడే ఏడు నెలలు. అయినా ట్రంప్‌ ప్రగల్భాలు మానుకోలేదు. ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు చాలా చిన్న విషయమన్నారు. కానీ యుద్ధం ముగించలేకపోతున్నారు.

ADVERTISEMENT

మొన్న అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ నిన్న అమెరికా విమానవాహక యుద్ధ నౌక డెస్ట్రాయిర్‌పై ప్రతిదాడులు చేసింది. కనుక అమెరికా మళ్ళీ ప్రతిదాడులు చేస్తుంది.

ఈ దాడులు-ప్రతిదాడులు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నంత కాలం ఈ యుద్ధం కొనసాగినా ఆశ్చర్యం లేదు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలనే మన సూక్తి ట్రంప్‌కి కూడా వర్తిస్తుంది. కానీ ట్రంప్‌కు ఇంట్లో ఈగల మోత తప్పడం లేదు. వివిధ దేశాలపై సుంకాల పెంపు, జన్మతః పౌరసత్వంతో సహా అయన తీసుకున్న పలు నిర్ణయాలను సుప్రీంకోర్టు ఎడాపెడా కొట్టి పడేస్తూనే ఉంది.

అమెరికా అధ్యక్షుడు యావత్ ప్రపంచాన్ని శాశించగలరు. అలాంటి ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను అమెరికా సుప్రీంకోర్టు పులిహోరలో కరివేపాకులా ఏరిపారేస్తోంది. ఆయనకు ఇంతకంటే అవమానం ఏముంటుంది?

అసలు అమెరికా ప్రజలు తనని అధ్యక్షుడుగా ఎందుకు ఎన్నుకున్నారు?అని ట్రంప్‌ ఒక్కసారి ఆలోచించి ఉండి ఉంటే, అయన దృష్టి అంతా అమెరికా పాలన, అభివృద్ధిపైనే ఉండేది.

కానీ ఆ ఒక్కటీ తప్ప అవసరం లేని ప్రతీ వ్యవహారంలో ట్రంప్‌ వేలు పెట్టి నలగ్గొట్టుకుంటూనే ఉన్నారు. ఆయన వేలు నలిగితే స్వయంకృతమని సరిపెట్టుకోవచ్చు. కానీ అయన ఎవరో కూడా తెలీని పలు దేశాలలో ప్రజలు నష్టపోతున్నారు.

ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టాక చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. ఆ కారణంగా పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు.. వాటితో నిత్యావసర సరుకుల ధరల పెరుగుతున్నాయి. ఆ భారం ప్రపంచ దేశాలలోని నిరుపేద ప్రజలపై కూడా పడుతోంది కదా?కనుక ట్రంప్‌ చేస్తున్న తప్పులకు ప్రపంచ దేశాల ప్రజలలో చాలా మంది తమకు తెలియకుండానే మూల్యం చెల్లిస్తున్నారన్న మాట!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ యావత్ ప్రపంచ దేశాలను బెదిరిస్తూ, సమస్యలలోకి నెట్టేసి అదే గొప్పదనంగా భావిస్తున్నారు తప్ప తన తప్పులను తెలుసుకోవడం లేదు. ఇది అమెరికాతో సహా యావత్ ప్రపంచ దేశాల దౌర్భాగ్యమే కదా?

ADVERTISEMENT
Latest Stories