భారతదేశం లో ఎన్నికల సందడి మొదలయ్యింది అంటే చాలు ఇక రాజకీయ పార్టీల ముఖ్యనేతల నుండి ఆ పార్టీ క్యాడర్ వరకు సామాన్యుడి ఇంటి తలుపు తట్టి మరి వారి అవసరాలను అడిగి తెలుసుకుంటారు, అలాగే వారు చేస్తున్న వృత్తి పనులను కూడా చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజల దృష్టిని తమ ఆవైపు ఆకర్షించుకునేలా చేసుకుంటారు.
పార్టీ అధినేత రోడ్డు సైడ్ టిఫిన్ బండి మీద పునుగులు తింటాడు, పార్టీ బడా నేతలు ఏకంగా బజ్జిలు వేసేస్తారు, ఇస్త్రీలు చేసేస్తారు, ఇక ఆయా పార్టీల చోటామోటా నేతలైతే పిల్లలకు స్నానాలు చేయించడం, ఇంట్లో మహిళలకు చీరలు పంచిపెట్టడం ఇలా చిత్రవిచిత్ర సన్ని’వేషాలన్నీ’ కూడా ఈ ఎన్నికల ప్రచారం సందర్భంలో మీడియా కంటపడుతూనే ఉంటాయి. అవి సామాన్యులను నవ్విస్తూనే ఉంటాయి.
అయితే ఇన్నాళ్లు ఇవన్నీ ఒక్క మనదేశానికే పరిమితమేమో అనే భ్రమలో ఉండేవారు ఇక్కడి ప్రజలు. కానీ ఏ దేశ రాజకీయ నాయకుడికైనా ఎన్నికల ప్రచారంలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోకతప్పదు అనేలా గత రెండు మూడు రోజులుగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ డ్రంప్ ప్రచార విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్…డెమోక్రటిక్ అభ్యర్థి కమల హర్రీస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. నిన్న పెన్సిల్వేనియా లోని మెక్ డొనాల్డ్ స్టోర్ లో స్వయంగా తానే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసి కస్టమర్లకు అందించారు ట్రంప్. అలాగే ఆ గెటప్ లోనే తన ప్రత్యర్థి కమలా కు కూడా 60 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు.
ఇక ఇప్పుడు WWE మాజీ రెజ్లర్ ది అండర్ టేకర్ తో ఇంటర్ వ్యూలో పాల్గొన్నారు ట్రంప్. ఈ సందర్భంగా తనకు WWE తో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా 2007 లో తనకు WWE మాజీ సీఈఓ మెక్ మాన్ కు మధ్య జరిగిన బాటిల్ అఫ్ ది బిలియనీర్స్ మ్యాచ్ ను ప్రస్తావించి WWE ప్రేమికుల దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసారు.
అయితే ఈ సారి అమెరికా అధ్యక్ష పదవి డొనాల్డ్ ట్రంప్ దే అంటూ సర్వేలన్నీ రిపబ్లిక్ పార్టీకే అనుకూలంగా లెక్కలు చెపుతున్నాయి. దీనితో ట్రంప్ మంచి జోరు మీద ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఎంతటి వాడైన తల్లికి కొడుకే అన్న చందంగా ఇండియా ప్రధాని అయినా అమెరికా అధ్యక్షుడైన ఎన్నికలొస్తే ప్రజలను ఆకట్టుకోవడానికి ఇటువంటి విన్యాసాలు చేయాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ ప్రచార విన్యాసాల ఫోటోలను, వీడియో లను షేర్ చేస్తున్నారు.




