ఒక దేశాధ్యక్షుడుని మరో దేశాధ్యక్షుడు సమావేశానికి ఆహ్వానిస్తే చాలా హుందాగా వ్యవహరించాలి. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి అటువంటి పట్టింపులు ఏవీ లేవు!
ఇదివరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని వైట్ హౌసుకి పిలిచి మీడియా ఎదుట ఆయనని చాలా దారుణంగా అవమానించారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలా వ్యవహరిస్తే చాలా ప్రమాదం.
కనుక నిన్న అలస్కా సమావేశానికి పుతిన్ వచ్చినప్పుడు ట్రంప్ చిరునవ్వులు చిందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు!
ట్రంప్ ఈ సమావేశాన్ని వైట్ హౌసులో నిర్వహించి ఉండొచ్చు. కానీ అలస్కాలో తమ సైనిక స్థావరంలో నిర్వహించారు!
వారిరువురూ కలిసి అలస్కాలో సమావేశానికి వెళుతుంటే అమెరికా యుద్ధవిమానాలతో ఆకాశంలో ప్రదర్శనలు చేయించారు!
అలస్కాలో సైనిక స్థావరంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వారిద్దరూ నడిచి వెళ్ళే దారి పొడవునా ఇరువైపులా అమెరికా యుద్ద విమానాలు నిలిపి ఉంచారు!
ఆకాశంలో ప్రదర్శనలు చేస్తున్నవి, దారి పొడవున మోహరించిన యుద్ధ విమానాలను పుతిన్‌కి చూపేందుకే ట్రంప్ ఏర్పాటు చేశారని అర్ధమవుతూనే ఉంది. అంటే వాటిని చూసి పుతిన్ భయపడతారని ట్రంప్ అనుకుంటున్నారా?అని సందేహం కలుగుతుంది.
అన్ని యుద్ధ విమానాలు ప్రదర్శించినా సుమారు రెండు గంటల చర్చల తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నిలిపివేస్తుందని చెప్పించలేకపోయారు! కానీ సమావేశం ఫలప్రదం అయ్యిందని పుతిన్ చేత చెప్పించగలిగారు! ఇదే అంశంపై చర్చించేందుకు త్వరలో తామిద్దరం మాస్కోలో మరోసారి సమావేశం అవుతామని ట్రంప్ చెప్పారు.
ఈ సమావేశం విఫలమైతే భారత్‌పై మరింత పన్నులు విధిస్తామని ట్రంప్ ముందే బెదిరించారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత పన్నులపై పునరాలోచన చేస్తానని ట్రంప్ అన్నారు. అంటే ‘ఆపరేషన్ సక్సస్ బట్ పేషంట్ డెడ్’ అనుకోవాలన్న మాట!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయకూడదని ట్రంప్ అంటున్నారు. చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సమావేశానికి ముందు హెచ్చరించారు కూడా. అంటే రష్యాతోనే ట్రంప్‌కి పేచీ అని అర్ధమవుతోంది.
కానీ పుతిన్‌తో ఇంత మర్యాదగా, స్నేహంగా వ్యవహరిస్తూ, రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్‌పై తన ప్రతాపం ప్రదర్శిస్తుండటం విచిత్రం. రష్యా నుంచి చైనా కూడా ఆయిల్ కొంటోంది. కానీ చైనాని ట్రంప్ పల్లెత్తుమాట అనడం లేదు.
అంటే అమెరికాతో సమానమైన శక్తి సామర్ధ్యాలున్న దేశాలతో ట్రంప్ మర్యాదగా వ్యవహరిస్తారు. అదే భారత్, ఉక్రెయిన్ వంటి దేశాల పట్ల చులకనగా వ్యవహరిస్తుంటారన్న మాట!




