అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకు పోతున్నారు. అధికారం చేపట్టేందుకు కనీసం 274 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా డొనాల్డ్ ట్రంప్‌కి ఇప్పటివరకు 267 ఓట్లు (51.2శాతం) లభించాయి.
డెమొక్రాట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గట్టి పోటీ ఇస్తున్నారు. కానీ ఆమెకు 214 ఎలక్టోరల్ ఓట్లు (47.4 శాతం) వచ్చాయి.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా, మిసిసిపి, ఓక్లహోమా, ఇండియానా, కెంటకీ, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, సౌత్ డకోటా, నార్త్ డకోటా, యూటా, వయోమింగ్, నెబ్రాస్కా, మోంటానా, టెన్నిసీ, అలబామా, ఐడహో రాష్ట్రాలలో విజయం సాధించారు.
ఈ ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ఏడు ‘స్వింగ్ స్టేట్స్’ జార్జియా, నార్త్ కరోలినాలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి పెన్సిల్వేనియా, ఆరిజోనా, మిచిగాన్, నెవడా, విస్కాన్సిన్ రాష్ట్రాలలో పూర్తి ఆధిక్యతతో సాగుతున్నారు.
కమలా హారిస్ న్యూజెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, కాలిఫోర్నియా, మేరీల్యాండ్, డెలావర్, మసాచూసెట్స్, ఇల్లినాయిస్, హవాయి, రోడ్ ఐల్యాండ్, కొలరాడో, న్యూహ్యాంప్ షైర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, వెర్మాంట్‌లో విజయం సాధించారు.
కనుక డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడం దాదాపు ఖాయం అయిన్నట్లే భావించవచ్చు.
ఇదివరకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు, భారత్ ఐటి కంపెనీలకు, ఎగుమతులకు చాలా ఇబ్బంది, నష్టం కలిగించే అనేక నిర్ణయాలు అమలుచేశారు. అలాగే గ్రీన్ కార్డ్, హెచ్-1బీ తదితర వీసాల జారీ విషయంలో అనేకానేక ఆంక్షలు విధించడంతో అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలకు, అమెరికా వెళ్ళాలనుకునే భారతీయులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.
అయితే ట్రంప్ దూకుడుతనాన్ని బాగా అర్దం చేసుకున్న ప్రధాని నరేంద్రమోడీ చాలా లౌక్యంగా, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఆయన వలన భారత్‌కు నష్టం కొంతమేర తగ్గించగలిగారు.
ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధ రంగంలో ఉన్నయి. మరోపక్క ఇరాన్, ఇరాక్, ఉత్తర కొరియా, రష్యా, చైనా దేశాలు ఆయుధాలు ఎక్కుపెట్టి సిద్దంగా ఉన్నాయి. కనుక డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఎన్నికై పగ్గాలు చేపట్టిన తర్వాత ఏమాత్రం దూకుడుగా వ్యవహరించినా అది మూడో ప్రపంచా యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది.
కనుక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైతే యావత్ ప్రపంచానికే అతిపెద్ద అగ్నిపరీక్ష పెట్టే అవకాశం ఉంటుంది.
—




