మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 5నెలలు జైల్లో ఉండి వచ్చినా ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. తన అనుచరులతో సమావేశమైనప్పుడు అయన చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
“నన్ను లోపల వేసినోడిని లోపల వేసింది ఎవరో తెలుసు కదా! నా వెనక ఆయన ఉన్నారు…ఎవరూ నా చిటికెన వేలుకు ఉన్న వెంట్రుక కూడా పీకలేరు! మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. అప్పుడు అందరి లెక్కలు తేల్చుదాం. అంతవరకు అందరూ ఓపిక పట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో మన అభ్యర్ధులను గెలిపించుకోవడం ద్వారా 2029లో మార్పు తప్పదని ‘వాళ్ళకు’ బలమైన సందేశం ఇద్దాం,” అని అన్నారు.
రాజకీయాలలో ఉన్న వల్లభనేని వంశీ లేదా మరే నాయకుడికైనా ఈమాత్రం ఆత్మవిశ్వాసం అవసరమే. కానీ సినిమాలలో హీరోలు అభిమానుల చప్పట్ల కోసం పంచ్ డైలాగులు కొట్టినట్లు, రాజకీయ నాయకులూ తమ అనుచరులు లేదా ప్రజల చప్పట్ల కోసం మాట్లాడే ఇలాంటి మాటలే కొంప ముంచుతాయి!
పోలీసులు ఆయననేమీ అక్రమ కేసులో అరెస్ట్ చేయలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అయన అనుచరులు గన్నవరంలో టీడీపి కార్యాలయం దాడి చేసినందుకు కేసు నమోదు చేశారు.
ఇప్పుడు “నా వెనుక ఆయన ఉన్నాడు,” అని వంశీ ఇంత ధైర్యంగా చెపుతున్నప్పుడు, ఆ కేసును ధైర్యంగా ఎదుర్కొని ఉంటే సరిపోయేది కదా?
కానీ ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు టీడీపి కార్యాలయంలో పని చేసిన సత్యవర్ధన్ అనే ఉద్యోగిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ ఎత్తుకుపోయి మరో కొత్త (కిడ్నాప్)కేసులో చిక్కుకొని జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. కనుక ఇది స్వయంకృతమని అర్ధమవుతూనే ఉంది.
అటువంటప్పుడు తనని సిఎం చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టారని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామన్నట్లు మాట్లాడటం వలన చేజేతులా కొత్త సమస్యలను సృష్టించుకుంటున్నట్లే అవుతుంది.
ఎలాగూ 2029 ఎన్నికలలో వైసీపీ గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామనే నమ్మకం అందరికీ ఉంది కదా?కనుక ఆలోగా ప్రస్తుతం ఎదురుగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీని గెలిపించుకొని టీడీపికి తమ తడాఖా చూపవచ్చు.
లేదా జగన్ చెప్పినట్లు 2029 వరకు కళ్ళు మూసుకు కూర్చోవచ్చు. ఆ తర్వాత అందరూ లెక్కలు సరిచూసుకోవచ్చు కదా? ఇప్పుడెందుకు మళ్ళీ ఎవరినో కెలకడం?





