రాజశేఖర్ – జీవితల చిన్న కుమార్తె శివాత్మిక, యువ నటుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దొరసాని’. . కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఒక సామాన్య కుర్రాడు, ఒక దొరసాని మధ్య ప్రేమ కథ ఈ చిత్రం. తెలంగాణ నేపథ్యంలో జరిగిన ఈ కథ తెలుగు తెరకు కొత్తేమి కాదు. సమయం, స్థానం మార్పుతో ఇటువంటి కథలు చాలానే వచ్చాయి.
దేవకి పాత్ర చేసిన శివాత్మిక కొన్ని షాట్స్ లో జీవితలానే అనిపించింది. అయితే సహజంగా మనం ఒక హీరోయిన్ కి ఉంటాయి అనుకునే అందచందాలు ఆమెకు లేవనే చెప్పుకోవాలి. కాకపోతే పీరియడ్ సినిమా కాబట్టి ఆమె ఆ పాత్రకు బానే సరిపోయింది. టీజర్ ను బట్టి ఆమె ఎలా చేసింది అనేది చెప్పడం కష్టమే. ఇక ఆనంద్ విషయానికి వస్తే విజయ్ తో పోలిక అనేది కష్టమే. వాయిస్ కొంచెం అన్నకు దగ్గరగా ఉన్నా పోలికలు అయితేనేమీ అభినయంలో అయితేనేమి విజయ్ కు చాలా దూరం.
దొరసాని అనే సినిమా వీరిద్దరి మొదటి సినిమా కావడంతోనే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు టీజర్ ను బట్టి ఇద్దరూ పెద్దగా ఆకట్టుకోలేదని, కథ కూడా రొటీన్ అని అనిపించడం సినిమాకు మైనస్ అనే చెప్పుకోవాలి. సినిమా కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్, బిగ్‌బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సురేష్ బాబు అండతో చెప్పుకోదగ్గిన విడుదలే సినిమాకు దక్కవచ్చు.



