ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి మొహమాటాలేవీ లేవు. పదవి, అధికారమే మా లక్ష్యమని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
ఒకవేళ అధికారంలో ఉంటే, మరో పదేళ్ళు, పాతికేళ్ళు మేమే అధికారంలో ఉంటాము. ఉండాలి. ఉంటేనే దేశానికి, రాష్ట్రానికి మేలు కలుగుతుందని ప్రజలకు నచ్చజెపుతున్నారు.
అయితే పదవి, అధికారం కోసం ఎవరైనా ప్రజాస్వామ్యబద్దంగా అన్ని ప్రయత్నాలు చేయవచ్చు. ప్రజలు మెచ్చి అధికారం కట్టబెడితే పదవులు చేపట్టవచ్చు.
కానీ అధికారం చేజిక్కించుకునేందుకు రాజకీయ వ్యూహాల పేరుతో కుట్రలు చేస్తుండటం, ప్రభుత్వంపై నిరంతరంగా బురద జల్లుతుండటం చాలా దారుణమైన ఆలోచనే.
గతంలో టీడీపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంతో పోరాడింది. కానీ ప్రజా సమస్యల గురించి నిలదీసేది. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తోండేది. దాని విధానాలను ఎండగట్టేది.
ఉదాహరణకు అమరావతి, పోలవరం నిర్మాణ పనులు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, డీఎస్సీ వంటి అంశాలపై జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఉండేది.
అందుకు ప్రతిగా జగన్ ఏవిధంగా వ్యవహరించేవారో అందరికీ తెలుసు. కనుక మళ్ళీ ఆ స్టోరీలన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఆ పదవి, అధికారం కోల్పోయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్ తీరు, వైసీపీ తీరు మారనే లేదని సిఎం చంద్రబాబు నాయుడు చేసిన విమర్శ ఆలోచింపజేస్తుంది.
సిఎం చంద్రబాబు నాయుడుని, ప్రభుత్వాన్ని, టీడీపిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే జగన్ శాసనసభకు వెళ్ళవచ్చు. లేదా బహిరంగ సభలు, పాదయాత్రలతో ప్రజల మధ్యకు వెళ్ళవచ్చు.
కానీ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని రాజకీయ వ్యూహాల పేరుతో ప్రభుత్వానికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ తన మేనకోడలి పెళ్ళి విషయంలో కూడా ఇలాగే కుట్రపూరితంగా వ్యవహరించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
ఈవిధంగా దురాలోచనలు, కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తూ నెగ్గుకు రావాలని జగన్ ప్రయత్నిస్తుండటాన్ని చంద్రబాబు నాయుడు వేలెత్తి చూపుతూ తప్పు పట్టడం, రాజకీయమని కొట్టి పడేయవచ్చు.
కానీ తన ధోరణి రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యమేనా? కాకుంటే… అని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన కూడా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా మారిపోవచ్చు.
వైసీపీ అవహేళనలు, విమర్శలతో నారా లోకేష్ కత్తిలా మారారు. పవన్ కళ్యాణ్ డెప్యూటీ సిఎం కాగలిగారు. వారిలో ఈ మార్పుకు కారణమైన జగన్ మారలేరా? అని ఆలోచించుకుంటే ఆయనకు, వైసీపీకి, రాష్ట్రానికి కూడా మంచిది.





