దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో ఇదేం విచిత్రమైన పరిస్థితి?

Dulquer Salmaan in I Am Game amid Malayalam market concerns

దుల్కర్ సల్మాన్ కెరీర్ ప్రస్తుతం చాలా విచిత్రమైన దశలో ఉంది. మలయాళ హీరో అయినప్పటికీ, ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగు దర్శకులతోనే క్లిక్ అవుతున్నాయి.

తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన సీతా రామం, లక్కీ భాస్కర్ ఆయనకు ఇక్కడ మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

ADVERTISEMENT

అయితే లక్కీ భాస్కర్ థియేటర్లలో సక్సెస్ కాలేదు. ఆ సినిమాకు ఎక్కువ పేరు OTTలోనే వచ్చింది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో దుల్కర్ సల్మాన్ మంచి పేరు, నమ్మకం సంపాదించుకున్నాడు.

ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది.

తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న దుల్కర్ సల్మాన్, తన సొంత మలయాళ మార్కెట్‌కు క్రమంగా దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. మలయాళ దర్శకులతో, మలయాళ ప్రేక్షకుల కోసం చేసిన సినిమాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ ఐ యామ్ గేమ్.

ఐ యామ్ గేమ్ విడుదల తర్వాత డిజాస్టర్ అయింది. సినిమా బాగాలేకపోవడం ఒక సమస్య అయితే, అంతకంటే ముందే ఓపెనింగ్ చాలా బలహీనంగా ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయం.

సినిమా ఫలితం పక్కన పెడితే, దుల్కర్ సల్మాన్ స్థాయికి కనీస ఓపెనింగ్ కూడా రాకపోవడం ఆయన మలయాళ మార్కెట్ పరిస్థితిని చూపిస్తోంది.

మరోవైపు తెలుగులో కూడా ఆయనకు సేఫ్ మార్కెట్ ఏర్పడిందని చెప్పలేం. మంచి నిర్మాణ సంస్థ, సరైన దర్శకుడు, బలమైన సినిమా కుదిరితేనే ప్రేక్షకులు వస్తున్నారు. కంటెంట్ తేడా కొడితే దుల్కర్ సల్మాన్ సినిమా ఇక్కడ కూడా పెద్దగా గుర్తింపు లేకుండానే వెళ్లిపోయే అవకాశం ఉంది.

కానీ తెలుగు మార్కెట్ కోసం ప్రయత్నిస్తూ మలయాళంలో తన పట్టును కోల్పోవడం చాలా అరుదైన పరిస్థితి.

ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ముందున్న అసలు సవాల్ మరో తెలుగు హిట్ కొట్టడం కాదు. ముందుగా తన మలయాళ మార్కెట్‌ను తిరిగి నిలబెట్టుకోవడం.

తెలుగు, మలయాళ సినిమాల మధ్య ఆయన ఇకపై ఎలాంటి బ్యాలెన్స్ పాటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories