మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని జగన్ ముందే చెప్పుకున్నారు. అయితే, ఆ నెపాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పైకి నెట్టేసి, నైతిక బాధ్యత నుంచి తెలివిగా తప్పించుకున్నారు.
రాజకీయాలలో తమ వైఫల్యాలను ఇతరులకు ఆపాదించడం సర్వసాధారణమే కావచ్చు. కానీ చేసిన తప్పులను, అక్రమాలను కూడా ఇతరులకు ఆపాదించడం రాజకీయ చతురత కానే కాదు. రాజకీయ శాడిజమే అన్నారు ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి.
“నామినేషన్ల సమయంలోనే ఘర్షణలు జరుగుతాయని జగన్ ముందే చెప్పారు. పోలింగ్ రోజున విధ్వంసం జరుగుతుందని చెప్పారు. అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాల చేయడం వెన్నతో పెట్టిన విద్య,” అని అన్నారు ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి.
“నాడు సొంత బాబాయ్ వివేకాను అతిదారుణంగా గొడ్డలితో నరికి హత్య చేయించి, చంద్రబాబు నాయుడే ఆ హత్య చేయించారని ఆరోపించడమే ఇందుకు నిదర్శనం. అప్పటి నుంచి ఇదే పద్దతిలో జగన్ సాగుతున్నారు. నేడు పులివెందులలో పోలింగ్ జరుగుతుందనగా నిన్న రాత్రి కార్లు తగలబెట్టించి టీడీపిని నిందిస్తున్నారు,” అని అన్నారు.
నేడు పోలింగ్ రోజున గంజాయి, రప్పా రప్పా బ్యాచ్‌లను దించి వారి చేత దాడులు చేయించడం, ఓటర్లను భయపెట్టి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. చేయకూడని ఇటువంటి పనులన్నీ చేసి, అవన్నీ టీడీపి.. చంద్రబాబు నాయుడే చేయించారని, సొంత మీడియాతో గట్టిగా దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లు,” అని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు.





