సోమవారం తెల్లవారుజామున భారత్-మయన్మార్ సరిహద్దులో సంభవించిన పెను భూకంపం ఈశాన్య భారతాన్ని వణికించింది. నాగాలాండ్, మణిపూర్, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు సరిహద్దున ఉన్న బంగ్లాదేశ్ లోనూ భూకంపం సంభవించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంప కేంద్రాన్ని ఇంపాల్ కు 33 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూకంపం వచ్చినట్టు భారత వాతావరణ శాఖతో పాటు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
బీజేపీ సీనియర్ నేత, తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్ కూడా ఈ భూకంప ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి హోదాలో ఈశాన్య రాష్ట్రాల్లోని కాఫీ తోటలను పరిశీలించేందుకు వెళ్ళిన నిర్మలా సీతారామన్, సరిగ్గా భూకంపం సంభవించిన సమయంలో ఆమె పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఉన్నారు. అక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న సీతారామన్, భూకంపం ప్రభావంతో తానున్న చోటు కూడా కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై నిర్మలా సీతారామన్ వెనువెంటనే ట్విట్టర్లో స్పందించారు. ‘‘సిలిగురిలోని ప్రభుత్వ అతిథి గృహంలో నేను ఉన్న గది కూడా కంపించిపోయింది. అంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేసారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కి ఫోన్ చేసి, భూకంపం సంభవించిన తీరు, జరిగిన నష్టం, సహాయక చర్యలు తాజా పరిస్థితిపై మాట్లాడారు. ఈ భూకంపం కారణంగా మణిపూర్ రాజధాని ఇంపాల్ లో ఓ వ్యక్తి చనిపోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. అంతకంతకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది.





