Jagan

ఎన్నికలకు ‘మేమందరం సిద్దం’ అని జగన్‌ చెపుతున్నప్పటికీ, ఎన్నికలకు ముందు వైసీపికి అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తుండటమే కాక 111 శాసనసభ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్ధులను బరిలో దించుతున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగు అయిన తర్వాత సంప్రదాయ కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్ వైఎస్సార్ కాంగ్రెస్‌ వైపు మళ్ళింది. కనుక కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో దిగితే ఇంతకాలం వైసీపి వైపు ఉన్న కాంగ్రెస్‌ ఓటర్లు మళ్ళీ కాంగ్రెస్‌వైపు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఎన్నికలలో వైసీపి ఓట్లు చీలి నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది.

మరోపక్క సునీత రెడ్డి తన తండ్రి హత్య కేసు గురించి సాక్షి మీడియాలోనే ముఖాముఖీ చర్చకు రమ్మనమని జగన్మోహన్‌ రెడ్డికి సవాళ్ళు విసురుతున్నారు. ఇద్దరు చెల్లెమ్మలకు ఏం జవాబు చెప్పాలో తెలియక వైసీపి తలపట్టుకొంది.

ఇంతలోనే ఈసీ జగన్‌ శ్రేయోభిలాషులుగా గుర్తింపు పొందిన ఓ ఐజీతో సహా ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ వేటు వేసింది. వారందరూ తక్షణం తమ విధుల నుంచి తప్పుకొని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఆదేశించింది.

గుంటూరు ఐజీ పాలరాజు, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ తరములేశ్వర్ రెడ్డిలను సరిగ్గా ఎన్నికలకు ముందు విధుల నుంచి తప్పించడం జగన్‌ ప్రభుత్వానికి పెద్ద అపశకునమే.

చంద్రబాబు నాయుడు కేసులు, ఆత్మరక్షణ కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని జగన్‌, విజయసాయి రెడ్డి తదితరులు ఎద్దేవా చేశారు. కానీ బీజేపీతో పొత్తు నుంచి టిడిపి ఆశించింది సరిగ్గా ఇదే.

జగన్‌ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలలో గెలవాలనే ప్రయత్నిస్తారని చంద్రబాబు నాయుడు ముందే కనిపెట్టి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆయన ఆలోచన సరైనదేనని అది ఫలిస్తోందని ఈసీ తాజా నిర్ణయంతో స్పష్టమైంది. అయితే ఇది ఇప్పుడే మొదలైంది. రాష్ట్రంలో ఇంకా చాలా మంది ఉన్నతాధికారులు వైసీపి నేతల సేవలో తరిస్తున్నారు. వారందరిపై కూడా తప్పక వేటు పడవచ్చు.

ఇక పింఛన్ చెల్లింపుల విషయంలో రాజకీయాలు చేద్దామనే జగన్‌ ప్రభుత్వ దురాలోచన కూడా బెడిసికొట్టింది. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సచివాలయ సిబ్బంది ద్వారా వారి ఇళ్ళవద్దే పింఛన్లు చెల్లించాలని ఈసీ ఆదేశించడం జగన్‌ ప్రభుత్వానికి మరో పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.

ఈసీ ఆదేశాలను ధిక్కరించలేక నేటి నుంచి ఈ నెల 6వ తేదీలోగా అందరికీ పింఛన్లు అందించాలని ఉత్తర్వులు జారీ చేయక తప్పలేదు.

మరో విషయం ఏమిటంటే ఇప్పుడు సచివాలయ సిబ్బంది మూడు రోజులలో 65,69,904 మందికి పింఛన్లు చెల్లించగలిగితే, మరి ఇంతకాలం లక్షల మంది వాలంటీర్లను ఎందుకు పోషిస్తోంది?అనే ప్రశ్న తలెత్తకమానదు. గత ఎన్నికలకు ముందు టిడిపికి కూడా ఇటువంటి అపశకునాలే కనిపిస్తే ఏమయిందో అందరికీ తెలుసు.