లలితా జ్యూవెలరీ అధినేత ‘డబ్బు ఎవరికీ ఊరికే రాదు,’ అని వాణిజ్య ప్రకటనలలో పదేపదే చెపుతుంటారు. ఆయన మాటలను టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి అన్వయించుకుంటే, ‘మద్దతు ఊరికే లభించదు’ అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
లౌకికవాదం, తొక్క తోటకూర అంటూ కబుర్లు చెపుతూ కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించింది. కనుక లౌకికవాదం కాపాడటం కోసమే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నప్పుడు మళ్ళీ మంత్రి పదవులు అవీ అడగకూడదు. కానీ తమకు కనీసం 2-3 మంత్రి పదవులు ఇవ్వాలని షరతు పెట్టి, అందుకు విజయ్ అంగీకరించిన తర్వాతే టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.
టీవీకే పార్టీకి 108 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 5 మందే ఉన్నారు. కానీ తమ మద్దతు కీలకం కావడంతో ఈ మెలిక పెట్టింది. అవునో కాదో రేపు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తెలుస్తుంది.
కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు కలిగిన వీసీకే పార్టీ కూడా గొంతెమ్మ కోరికలు కోరుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి ఒక కీలకశాఖ మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని, విజయ్ రాజీనామా చేయబోయే నియోజకవర్గం నుంచి తమ అధినేత పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది.
నలుగురు ఎమ్మెల్యేలు కలిగిన వామపక్షాలు మాత్రం ఎటువంటి డిమాండ్స్ పెట్టకుండా టీవీకే పార్టీకి నిన్న సాయంత్రం మద్దతు లేఖ అందించాయి.
ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 5 రోజుల్లోనే అన్ని పార్టీలు కలిసి విజయ్‌కి అనేక కొత్త రాజకీయ పాఠాలు నేర్పించాయి. కనుక డబ్బులు ఎవరికీ ఊరికే రావన్నట్లు మద్దతు కూడా ఊరికే రాదని విజయ్‌కి ఈ పాటికి అర్ధమయ్యే ఉండాలి.




