90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా వస్తుందంటే సహజంగానే కొన్ని అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఆనంద్ దేవరకొండ, బేబీ హీరోయిన్ వైష్ణవితో ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే వారం విడుదల కానుంది.
అయితే ట్రైలర్‌లో వినిపించిన కొన్ని డైలాగులు మాత్రం అసలు ఈసారి ఆయన ఎలాంటి సినిమా తీశారనే సందేహాన్ని పెంచాయి.
“రిలేషన్‌షిప్ ఎపిక్ ఎప్పుడు అవుద్దో తెలుసా?.. సెక్స్ చేసాక… నీ పార్ట్‌నర్ ‘ఐ యామ్ శాటిస్‌ఫైడ్’ అని చెప్పాలి…!”
ఇది ఒక్కటే కాదు. ఎపిక్ సినిమాలో ఓ పాత్ర చేస్తున్న మ్యాడ్ దర్శకుడు కూడా వేదికపై మాట్లాడుతూ ఇలా అన్నారు.
“సెక్స్ చేసినవ్ అనుకో… అమ్మాయిల కళ్ళనుండి నీళ్లు వస్తాయి..”
ఈ డైలాగులు విన్న తర్వాత, అసలు ఆదిత్య హాసన్ ఈసారి ఏం చేయబోతున్నారనే ప్రశ్న రావడం సహజం.
ట్రైలర్ మొత్తంగా పర్వాలేదనిపించినా, సినిమా కంటే ఈ డైలాగుల గురించే ఎక్కువగా ఆలోచించే పరిస్థితి వచ్చింది.
కథలో వీటికి నిజంగా అవసరం ఉండొచ్చు. ఆ సందర్భం సినిమా చూసిన తర్వాత అర్థం కావచ్చు. కానీ కేవలం దృష్టిని ఆకర్షించడానికి, చర్చ పెంచడానికి ఇలాంటి డైలాగులను ట్రైలర్‌లో పెట్టి ఉంటే మాత్రం సమర్థించడం కష్టం. ఇలాంటి పద్ధతులు కొద్దిసేపు చర్చ తెచ్చినా, సినిమాపై ఆసక్తిని ఎక్కువకాలం నిలబెట్టలేవు.
ఇదే ట్రైలర్ మరో కొత్త దర్శకుడి నుంచి వచ్చి ఉంటే బహుశా ఇంతగా పట్టించుకునేవారు కాదేమో. ఆదిత్య హాసన్ ఇంతకు ముందు 90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి సున్నితమైన సిరీస్ ఇచ్చారు కాబట్టే, ఇప్పుడు కనిపిస్తున్న ఈ మార్పు మరింత ఆశ్చర్యపరుస్తోంది.
వచ్చే వారం సినిమా విడుదలయ్యాక ఈ డైలాగులకు కథలో నిజమైన అవసరం ఉందా, లేక కేవలం చర్చ కోసమే వాడారా అనేది తేలుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ అంచనాలు పెంచడం కంటే ప్రశ్నలనే ఎక్కువగా మిగిల్చింది.





