‘చిరంజీవికి పవన్ కళ్యాణే దారి చూపాలి’ అనగానే ఏదేదో ఊహించుకోవద్దు.. ఎందుకంటే ఈ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కాదు. ఇది వైసీపీ నుంచి జనసేనలో చేరిన గంజి చిరంజీవి గురించి!
ఒకప్పుడు జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపేవారు కారు. కానీ ఇప్పుడు జనసేన తొలిసారిగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డెప్యూటీ సిఎం పదవి చేపట్టడంతో రాజకీయ నిరుద్యోగులు, ముఖ్యంగా వైసీపీ నేతలు జనసేనలోకి క్యూ కడుతున్నారు. అంటే జనసేనని ఓ బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా అందరూ గుర్తిస్తున్నారన్న మాట!
ఇప్పటికే వైసీపీ నుంచి బాలినేని, జయ మంగళ వంటివారు జనసేనలో చేరారు. తాజాగా గంజి చిరంజీవి-రాధ దంపతులు కూడా జనసేనలో చేరారు.
గంజి చిరంజీవి రాజకీయ జాతకం చూస్తే అయ్యో అనిపించక మానదు. అన్నీ చేతికి అందివచ్చిన్నట్లే వచ్చి చేజారిపోతుంటాయి పాపం!
గంజి చిరంజీవి మొదట టీడీపీలోనే ఉండేవారు. 2014 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు కూడా. కానీ టీడీపీ ప్రభంజనంలో కూడా వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు!
ఒకవేళ ఆనాడు గెలిచి ఉంటే నేడు ఆయన రాజకీయ జీవితం ఖచ్చితంగా ఈవిదంగా ఉండేది కాదని చెప్పొచ్చు. 2019 ఎన్నికలలో మళ్ళీ మంగళగిరి నుంచి పోటీ చేద్దామనుకుంటే, అప్పుడు నారా లోకేష్ కోసం ఆ సీటుని వదులుకోవలసి వచ్చింది.
ఆ తర్వాత వైసీపీలో చేరితే జగన్ ఆయనకు నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఆప్కో సంస్థకు ఛైర్మన్ పదవి ఇచ్చారు. 2024 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి గంజి చిరంజీవిని వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించిన జగన్ చివరి నిమిషంలో ఆయన పక్కన పెట్టేశారు. ఆ విదంగా అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం చేతికి అందినట్లే అంది చేజారిపోయింది.
అయినప్పటికీ 2024 ఎన్నికలో వైసీపీ గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే, బహుశః చిరంజీవికి జగన్ గంజి పెట్టి ఇస్త్రీ చేసి నిగనిగ లాడించేవారేమో? కానీ ఆయన దురదృష్టం కొద్దీ ఆ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో ఆయనకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.
ఈవిదంగా ఓకే ఒక్క ఓటమితో గంజి చిరంజీవి రాజకీయ జీవితం తలక్రిందులవడం ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ రాజకీయ నాయకులలో చాలా మందికి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి.
గంజి చిరంజీవి ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. ఆయనకు గతంలో సిఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలతో మంచి అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్‌కి కూడా ఆయన పట్ల సానుభూతి ఉంది. చిరంజీవిని ఒడ్డున పడేయకుండా ఉండరు. కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఏదో పదవి దక్కడం ఖాయమే.
కానీ మంగళగిరిని నారా లోకేష్ సొంత నియోజకవర్గం చేసేసుకున్నారు కనుక ఇక దానిని మరిచిపోయి వేరే నియోజకవర్గాన్ని వెతుక్కొని ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకోవలసిందే. పవన్ కళ్యాణే ఆయనకు ఓ దారి చూపించాల్సి ఉంటుంది.






