బుల్లితెర కమల్… ప్రమాదం… ప్రేమ… ఆర్ధిక వ్యధ..!

Getup-seenu‘జబర్దస్త్’షోతో పాటు బుల్లితెరపై మరికొన్ని షోలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శీను… బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వెండితెరపై నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోన్న శీను, తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు తప్పిన కారు ప్రమాదం గురించి వివరిస్తూ… “ఒకసారి మేం బళ్లారి వెళ్లి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాం. అర్థరాత్రి సమయం కావడంతో అందరం మంచి నిద్రలో వున్నాం. కొంతదూరం వచ్చాక అంతకుముందే వేసిన రోడ్డు కావడంతో, మా డ్రైవర్ స్పీడ్ తగ్గించి కారు నడుపుతున్నాడు.

కారు ఒకవైపుకు వాలిపోవడమే కాకుండా పెద్దగా సౌండ్ చేస్తోంది. కారు ఎందుకు ఓ పక్కకి ఒరిగిందో, ఎందుకు సౌండ్ వస్తుందో తెలుసుకోకుండా డ్రైవర్ అలాగే నడిపేస్తున్నాడు. ఆ సౌండ్ కి నాకు మెలకువ వచ్చి లేచాను. కారు ఆపమని చెప్పి దిగి వెళ్లి చూశాను. కారుకి వెనక చక్రం ఒకటి లేదు, ఎక్కడో ఊడిపోయింది. ఒక్కసారిగా గుండె ఝల్లుమనడంతో ఆ విషయం మిగతా వాళ్లకు చెప్పాను. మా డ్రైవర్ తాగేసి ఉండటం వలన ఆయన టైర్ ఊడిపోయిన విషయాన్ని గమనించలేదు. అదృష్టం బాగుండి ఆ రోజు అందరం బయటపడ్డాం” అంటూ తన జీవితంలో మరిచిపోలేని ఓ సంఘటన గురించి తెలిపాడు.

ADVERTISEMENT

“నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె తమిళనాడులోని ‘తిరుప్పూర్’ లో ఒక హాస్టల్లో ఉండేది. 15 రోజులకు ఒకసారి నేను అక్కడికి వెళ్లేవాడిని. హాస్టల్ వాళ్లు ఒక గంటసేపు మాట్లాడటానికే అనుమతినిస్తారు. ఆ గంటసేపటి కోసం నేను మా ఆకివీడు నుంచి అంత దూరం వెళ్లేవాడిని. తాను అక్కడి నుంచి తన ఊరు వెళ్లాలనుకుంటే మాత్రం నేను కూడా హాస్టల్ దగ్గరికి వెళ్లి, అక్కడి నుంచి కలిసి ప్రయాణం చేసేవాళ్లం. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను .. కానీ వాళ్ల వాళ్లు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్లై ఇప్పుడు ఢిల్లీలో ఉంటోంది. అప్పుడు బాధపడినా, నన్ను అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఇప్పుడు హ్యాపీగానే వున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

తాను ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను గురించి ప్రస్తావిస్తూ… “మా అక్కయ్య పెళ్లి కోసం మేము అప్పు చేశాము. అందువలన ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్లం. నేను అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ హాస్టల్లో ఉండేవాడిని. ఫీజులకి, పుస్తకాలకి డబ్బులు ఉండేవి కావు. అందువలన వేసవి సెలవులు రాగానే ఇంటికి వెళ్లకుండా ఎక్కడ పని దొరుకుతుందా అని వెతుక్కునేవాడిని. చెరుకు మిషన్ దగ్గర పనిచేసేవాడిని. అలా పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు వచ్చేవి. ఇక ప్రతి ఆదివారం కూలి పనులకు కూడా వెళ్లేవాడిని. నాట్లు వేయడం, కుప్ప నూర్చడం వంటి పనులు చేసేవాడిని. రోజుకు 40, 50 రూపాయలు వచ్చేవి” అంటూ తన వ్యధను పంచుకున్నాడు.

ADVERTISEMENT
Latest Stories