సామాన్య ప్రజలు సైతం చిన్న ఇల్లు కట్టుకుంటే నలుగురినీ పిలిచి గృహాప్రవేశం చేసుకుంటారు. ‘మా ఇల్లు చూడండని’ అందరినీ పిలిచి పిలిచి మరీ చూపించి వారు మెచ్చుకుంటే సంతోషంతో పొంగిపోతుంటారు.
కానీ జగన్ ప్రభుత్వం విశాఖలో ఋషికొండ మీద సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి అమెరికా అధ్యక్షుడు అధికార నివాసం ‘వైట్ హౌస్’కు ఏమాత్రం తీసిపోకుండా విలాసవంతంగా నిర్మించుకున్న సిఎం క్యాంప్ కార్యాలయం అని చెప్పుకోలేని పర్యాటక శాఖ భవనాలలో వైసీపి మంత్రులు, నేతలు చాలా రహస్యంగా గృహాప్రవేశం చేయాల్సిన కర్మ ఏమిటి?
అంత ఖర్చు చేసి గొప్పగా నిర్మించుకున్నా ‘ఇది మా సిఎం క్యాంప్ కార్యాలయం,’ అని సగర్వంగా చెప్పుకోలేకపోవడం దౌర్భాగ్యమే కదా?అన్ని వందల కోట్ల ప్రజాధనంతో నిర్మించుకొన్న ఇంట్లో అడుగు పెట్టడానికి సిఎం జగన్మోహన్ రెడ్డి వెనకాడుతుండటాన్ని ఏమనుకోవాలి?
సరే! మనకు మొదటి నుంచి పరదాలు అలవాటే కనుక ఋషికొండని, దానిపై నిర్మించిన ఈ భవనాన్ని కూడా పరదాల మాటున, పోలీసుల మాటున దాచేసుకొంటున్నప్పుడు, ఆ భవనాలలో హటాత్తుగా ఈ పూజలు, హోమాలు, ఈ హడావుడి దేనికి?అంటే ఎన్నికల కోసం మళ్ళీ మొదలుపెట్టిన డ్రామాయే అనుకోవలసి ఉంటుంది.
ఎందుకంటే త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. అది వస్తే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అప్పుడు ఈ హడావుడి చేయడానికి సాధ్యపడదు. కనుక ఇప్పుడే ‘మమ’ అనిపించేస్తే, ఆనక జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు హెలికాఫ్టర్లో ఓసారి అలా అక్కడ కాలు మోపి పవిత్రం చేసేస్తే, వైసీపి నేతలందరూ ‘అదిగో మన సిఎం… ఇదిగో మన విశాఖ రాజధాని,” అంటూ కోరస్‌గా పాట పాడేందుకు సిద్దంగా ఉన్నారు.
ఆ పాటతో రాష్ట్ర ప్రజలని ముఖ్యంగా ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజలని మెప్పించి ఓట్లు దండుకోవచ్చని గొప్ప ప్లాన్ వేసిన్నట్లున్నారు. అయితే 58 నెలలుగా వైసీపి నేతల ఈ రాజధాని డ్రామాలన్నీ చూస్తున్న ప్రజలకు, ఆ డ్రామాలో ఈ ఎపిసోడ్ దేనికో అర్దం చేసుకోలేరని వైసీపి నేతలు అనుకోవడమే మూర్ఖత్వం కాదా?




