శ్రీకాకుళం జిల్లాలో టీడీపి, వైసీపీల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకవైపు కింజారపు అచ్చన్నాయుడు తదితరులు, మరోవైపు ధర్మాన ప్రసాదరావు తదితరులున్నారు.
అనేక ఏళ్ళుగా టీడీపి, వైసీపీల మధ్య రాజకీయ ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపిలో చేరిన గుండ అప్పలనాయుడు తదనంతరం అయన సతీమణి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి జిల్లా టీడీపి సీనియర్ నేతల్లో ఒకరుగా మంచి గుర్తింపు పొందారు.
కానీ మున్సిపల్ ఎన్నికలలో ఆమెకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా టీడీపితో ఉన్న అనుబంధాన్ని ఒక్క రాజీనామా లేఖతో తెంచేసుకున్నారు.
పార్టీని నమ్ముకున్న తమ కుటుంబానికి అవమానాలే మిగిలాయంటూ రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆవేదన అర్థం చేసుకోవచ్చు.
అయితే ఆమె టీడీపికి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం పెద్ద షాక్. అంటే టీడీపికి షాక్ అని కాదు. ఆమె రాజకీయ జీవితంలో వేసిన ఈ పెద్ద తప్పటడుగుతో ఆమె అనుచరులు షాక్ అయ్యారు.
ఇంతకాలం ఏ వైసీపీతో పోరాడామో అదే వైసీపీలో చేరి, తమని రాజకీయంగా వేధించిన స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఎలా పని చేయగలమని ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమదవన్నట్లు ఇప్పటికే జిల్లా వైసీపీలో ధర్మానప్రసాద రావు, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి.
కనుక ఇంతకాలం వారిపై కత్తులు దూసిన గుండా లక్ష్మీదేవి, ఇప్పుడు వారితో కలిసి పనిచేయగలరా? అయినా మున్సిపల్ సీటు కోసం అధికారంలో ఉన్న టీడీపిని వదులుకొని, మళ్ళీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందో రాదో తెలీని పరిస్థితిలో ఉన్న వైసీపీలో చేరడం అంటే రాజకీయ ఆత్మహత్యతో సమానమే అనిపిస్తుంది.
గుండ లక్ష్మీదేవి చాలా సీనియర్ నాయకురాలు. కనుక ఆమె కాస్త ఓపిక పట్టి ఎన్నికల తర్వాత సిఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఉండి ఉంటే ఆయన తప్పకుండా ఆమెకు మేలు చేసేవారు. కానీ సొంత తల్లిని, చెల్లినే గౌరవించని జగన్ను నమ్ముకొని వైసీపీలో చేరడం అవసరమా? అనిపిస్తుంది.





