ఇన్నాళ్లుగా కాపు సామజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలి అంటూ తనకు నచ్చినట్టు లేఖలు రాస్తూ జనసేనాని పై ఒత్తిడి తెచ్చిన కుల వృద్ధుడు, సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామజోగయ్య….ఎన్నికలకు సమయం సమీపించడంతో తానూ ఇన్నాళ్లుగా తొడిగిన వైసీపీ ముసుగు తొలగించారు.
మొన్నటిదాకా ముద్రగడ ముసుగులో జనసేన మీద విషం చిమ్మిన వైసీపీ వారి ఇరువురి బంధం బట్టబయలైందని, ముద్రగడ మాయలో, వైసీపీ ఉచ్చులో జనసైనికులు పడక పోవడంతో ఈసారి మరో కాపు సామజిక వర్గానికి సంబందించిన సీనియర్ లీడర్ ను అనూహ్యంగా తెర మీదకు తెచ్చింది వైసీపీ. ఎవ్వరికి అనుమానం రాకుండా పవన్ శ్రేయోభిలాషిగా జనసేనకు, ఆపార్టీ కార్యకర్తలకు దగ్గరైన హరి రామ జోగయ్య నేను చెప్పినట్లు వినకపోతే మార్చి 1 న నేనేంటో చూపిస్తా అంటూ సాక్ష్యాత్తు జనసేనానికే డెడ్ లైన్ విధించారు.
ఈ డెడ్ లైన్ తో హరిరామ జోగయ్య మీద కొంతమంది జనసైనికులకు కొత్తగా అనుమానాలు తలెత్తాయి.., మరికొంతమందికి ఇప్పటికే ఉన్న అనుమానాలు బలపడిపోయాయి. జనసేన – టీడీపీ బంధాన్ని విచ్చినం చేయడానికే వైసీపీ జోగయ్యతో కోవర్టు ఆపరేషన్ సిద్ధం చేసిందని ఊహించిన జనసేనకు ఎంతోకాలం సస్పెన్సు ఇవ్వకుండా ట్విస్ట్ రివీల్ చేసారు జోగయ్య.
గతంలో కూడా చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో కూడా మెగాస్టార్ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆ పార్టీ పై మెగాస్టార్ పై విషం చిమ్మి వెన్నుపోటు పొడిచి పార్టీ నాశనానికి తనవంతు పాత్ర పోషించారు జోగయ్య. అన్నరాజకీయ జీవితాన్ని సమాధి చేసిన వారిలో ఒకరుగా ఉన్న ఇటువంటి వ్యక్తి పట్ల పవన్ అప్రమత్తంగా ఉండాల్సింది పోయి సానుకూలంగా వ్యవహరించడం తిరిగి జోగయ్యకు పవన్ అవకాశం ఇచ్చినట్లయింది.
తిరిగి మళ్ళీ జనసేనకు కూడా అదే తరహా వెన్నుపోటు పొడిచి వైసీపీ ఫ్యాన్ కిందకు చేరారు. ఆచంట జనసేన ఇంచార్జ్ గా ఉన్న హరిరామ జోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ టీడీపీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ రాలేదు అనే కారణం చెప్పి సూర్యప్రకాష్ వైసీపీ గూటి చేరారు. ఈ రోజు తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ కు వెళ్లి జగన్ ను కలిసిన సూర్య ప్రకాష్ త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇటువంటి వారికోసమే ఎదురు చూస్తున్న జగన్ కూడా వీరికి పెద్ద పీటవేసి పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే వైసీపీ పాలకొల్లు ఇంచార్జ్ గా సూర్య ప్రకాష్ ను నియమించే అవకాశం ఉందంటూ వార్తలు వినపడుతున్నాయి. ఒక జనసైనికుడిని నిలబెట్టి ముద్రగడ మీద విజయం సాధిస్తాం అంటూ భీరాలు పోయిన జోగయ్య ఇప్పుడు అదే జనసేనను కించపరుస్తున్న వైసీపీ కి మద్దతు తెలపడాన్ని ఏమనాలి..?
ఇన్నాళ్లు పవన్ సీఎం కావాలి అంటూ జనసైనికులను రెచ్చకొట్టిన జోగయ్య, తన కుమారుడుని ఎమ్మెల్యే గా చేయడానికి నమ్ముకున్న జనసైనికులకు వెన్ను పోటు కాదు ఏకంగా గొడ్డలి పోటే పొడిచారు. ఇలా చేస్తే మీరనుకున్నట్టుగా కాపు నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలరా జోగయ్య గారు..? మీ కల నెరవేరవేరిందా పెద్దాయనా..? అంటూ జనసైనికులు జోగయ్య మీద విమర్శలు గుప్పిస్తున్నారు.
తన వ్యక్తిగత స్వార్థం కోసం ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి అన్నదమ్ములను రాజకీయం గా దెబ్బకొట్టడానికి ప్రత్యర్థులతో చేతులు కలిపి కులాన్ని అడ్డుపెట్టుకున్న ఈ పెద్దమనిషి కాపు సామజిక వర్గానికి చేసిన మంచేమిటో చెప్పగలరా..? ఇప్పటికైనా ఇటువంటి కోవర్టుల ఉచ్చులో పడి అధినేత పై ఒత్తిడి పెంచి మరోసారి పవన్ రాజకీయ జీవితానికి సమాధి కట్టడానికి సిద్దపడతారా..?
మన బలమెంతో మనకు అంతే హక్కు అంటూ ముందుగు వేస్తున్న నాయకుడితో కలిసి నడిచేదెవరో ముందుకు రావాలి. తనను నమ్మిన చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఎన్నికల సమయంలో పార్టీ మీద నిందలు వేసి, అధినాయకుడి మీద ఆరోపణలు చేసి పార్టీని, నాయకుడిని నట్టేట ముంచి తన దారి తానూ చూసుకోవడం జోగయ్యకు ఇది రెండో సారి కావడంతో ఇది ఆయనకు అలవాటే…ఎందుకంటే ఆయన జోగయ్య…అంటూ జనసైనికులు జోగయ్య పై జోకులు పేలుస్తున్నారు.
పవన్ కూడా ఈసారి జోగయ్య ట్రాప్ లో పడకుండా తాడేపల్లి గూడెంలో టీడీపీ – జనసేన నిర్వహించిన జెండా సభలో తన పొత్తుల మీద, తానూ తీసుకున్న సీట్ల మీద తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టడంతో ఇక ఈ కోవర్టు ఆపరేషన్ ముందుకు సాగదని గ్రహించిన జోగయ్య అతని కుమారుడు తమ అసలు రంగు బయట పెట్టి గతంలో పని చేసిన తన యజమాని వద్దకు చేరుకున్నారు.




