కేసీఆర్‌ పట్ల హరీష్‌ రావుకి ఎందుకు ఇంత విధేయత?

Harish Rao with KCR and KTR

కేసీఆర్‌ వారసుడు, తదుపరి ముఖ్యమంత్రి ఎవరంటే కేటీఆరే అని అందరూ చెప్తారు. కనుక పార్టీలో కేటీఆర్‌ ఉన్నంతకాలం తాను బళ్ళాలదేవుడిలా నం.2 స్థానంలోనే ఉండిపోవాలని హరీష్‌ రావుకు బాగా తెలుసు.

కేసీఆర్‌ రెండో సారి తెలంగాణ సిఎం అయినప్పుడు కొన్ని నెలల పాటు హరీష్‌ రావుకి మంత్రి పదవి ఇవ్వకుండా అయన స్థానం ఏమిటో చూపారు. అంతేకాదు… ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారని ఆ పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు వి. ప్రకాష్ చెప్పారు.

ADVERTISEMENT

కేసీఆర్‌ ఇంతగా అవమానిస్తున్నా హరీష్‌ రావు ఆయననే ఎందుకు అంటిపెట్టుకున్నారు?బీఆర్ఎస్‌ పార్టీని కాపాడుకోవడానికి ఆయన ఎందుకు ఇంతగా తాపత్రయపడుతున్నారు? కేటీఆర్‌కి విధేయంగా ఎందుకుంటున్నారు? అనే సందేహాలు కలుగక మానదు.

1. కేసీఆర్‌ తర్వాత ఆ పార్టీలో అంత రాజనీతిజ్ఞుడు హరీష్‌ రావే. కేటీఆర్‌కి వాక్చాతుర్యం ఉంది కానీ దానిని అహంకారం మింగేస్తోంది. ఆ నోటి దురుసు ఏదో రోజు ఆయన కొంప ముంచడం ఖాయం.

2. కూతురు కవితని కేసీఆర్‌ బయటకు గెంటేస్తే ఆమె పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక కేసీఆర్‌ మీద అలిగి బయటకు వెళితే తన పరిస్థితి అదే అని హరీష్‌ రావుకి బాగా తెలుసు.

3. రాజకీయాలలో ఓ లక్ష్యం చేరుకోవడమే ముఖ్యమని హరీష్‌ రావు భావిస్తుండటం వలననే ఈ అవమానాలను పట్టించుకోవడం లేదని భావించవచ్చు.

4. పైగా ఇంత రాజకీయ అనుభవం ఉన్న ఆయన వేరే పార్టీలో చేరలేరు. కాంగ్రెస్‌ లేదా బిజేపిలో చేరితే ఆయా పార్టీల సీనియర్ నేతల ముందు చేతులు కట్టుకొని నిలబడక తప్పదు. అదేదో కేసీఆర్‌ ముందే కట్టుకొని నిలబడితే ఏదో రోజు అదృష్టం ఏదో రూపంలో తన తలుపు తట్టకుండా ఉంటుందా? అని హరీష్‌ రావు అవమానాలు దిగమింగుకొంటూ చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారనుకోవచ్చు.

5. హరీష్‌ రావు మొదటి నుంచి బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నారు. ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. కనుక ఉద్యమకారుడుగా, మంచి రాజకీయ నాయకుడుగా, సమర్దుడైన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు.

6. మహారాష్ట్రలో శివసేనని షిండే దెబ్బ తీసినట్లు హరీష్‌ రావు కూడా తెర వెనుక పావులు కదిపి కేసీఆర్‌, కేటీఆర్‌లను తప్పించవచ్చు. దాని వలన పార్టీలో, ప్రజలలో చెడ్డపేరు వస్తుంది. కేసీఆర్‌, కేటీఆర్‌ వారి విధేయులు శత్రువులుగా మారితే వారిని ఢీ కొనవలసి ఉంటుంది. అంతకంటే కేసీఆర్‌, కేటీఆర్‌లకు విధేయంగా ఉంటూ, బీఆర్ఎస్‌ పార్టీని కాపాడుకోవడమే చాలా తెలివైన పని.

7. ఏదో రోజు ఆరోగ్య కారణాలతో కేసీఆర్‌ తప్పుకోవడం ఖాయం. ఒకవేళ తప్పుకోకపోతే కేసులు ఉండనే ఉన్నాయి. అప్పుడు పార్టీ పగ్గాలు వాటంతట అవే హరీష్‌ రావు చేతికి వస్తాయి.

8. తమ రాజకీయ ప్రత్యర్ధిగా కేసీఆర్‌, కేటీఆర్‌లు ఉండటం కంటే హరీష్‌ రావు ఉండటమే మంచిదని కాంగ్రెస్‌, బిజేపిలు భావించిన రోజున ఆ కేసులు వారి మెడకు ఉచ్చులా బిగుసుకునే అవకాశం ఉంటుంది.

9. లేదా కొడుకు భవిష్యత్‌ కంటే పార్టీని కాపాడుకోవడమే ముఖ్యమని కేసీఆర్‌ భావిస్తే స్వయంగా హరీష్‌ రావుకి పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇంతకాలం మౌనంగా అవమానాలు దిగమింగుతూ, కేసీఆర్‌కి, పార్టీకి వీర విధేయంగా ఉన్నందుకుగాను అప్పుడు హరీష్‌ రావు గౌరవం అమాంతం పెరిగిపోతుంది. అప్పుడు పార్టీలో అందరూ మరో ఆలోచన చేయకుండా అయన నాయకత్వాన్ని అంగీకరిస్తారు.

10. కనుక తిరుగుబాటు చేసి పార్టీ పగ్గాలు దక్కించుకోవడం లేదా వేరే పార్టీలో చేరి అదృష్టం పరీక్షించుకోవడం కంటే ఇదే అత్యుత్తమైనది.

కనుక పార్టీ పగ్గాలు, పదవులు, గౌరవం, ప్రతిష్ట కోసం అర్రులు చాచకుండా చాలా ఓపికగా హరీష్‌ రావు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. రాజకీయాలలో రాణించాలనుకునేవారికి ఉండాల్సిన గొప్ప లక్షణం ఇదే.

ADVERTISEMENT
Latest Stories