బిఆర్ఎస్ ది భయమా.? బలప్రదర్శనా.?

Harish Rao SIT Probe: BRS Fear or Show of Strength?

తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో రాజకీయం చేయడం, పార్టీ క్యాడర్ లో భావోద్వేగాలను రెచ్చకొట్టడంలో బిఆర్ఎస్ కు మంచి అనుభవమే ఉందని చెప్పాలి. నాటి ఉద్యమ కాలం నుండి నేటి ప్రతిపక్ష పోరాటాల వరకు అదే భావోద్వేగాలతో బిఆర్ఎస్ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

అయితే ఫోన్ టాపింగ్ కేసు విచారణ నేపథ్యంలో సిట్ అధికారులు మాజీ మంత్రి హరీష్ రావు కి నోటీసులు అందించి విచారణకు రావాలంటూ ఆదేశించగా, హరీష్ విచారణ నిమిత్తం సిట్ ముందు హాజరయ్యారు.

ADVERTISEMENT

అయితే గంటల తరబడి కొనసాగుతున్న హరీష్ విచారణకుగాను ఆయనకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు సిట్ కార్యాలయం కు చేరుకొని హరీష్ కి అనుకూలంగా, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

దీనితో ఆ ప్రాంగణం మొత్తం ఉద్రిక్తత వాతావరణంగా మారిపోవడంతో పోలీసులకు – నిరసనకారులు మధ్య తోపులాట జరిగింది. అయితే కేవలం హరీష్ విచారణ కే బిఆర్ఎస్ ఇంతలా నానా హడావుడి చేస్తుండడంతో ఇది బిఆర్ఎస్ భయమా.? లేక బలప్రదర్శనా.? అంటూ చర్చ మొదలయ్యింది.

అసలు ఫోన్ టాపింగ్ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ హరీష్ అంత ధీమాగా చెపుతుంటే బిఆర్ఎస్ ఎందుకు ఇంతలా పార్టీ క్యాడెర్ తో హంగామా చేస్తుంది.? అంటే ఈ కేసు విషయంలో బిఆర్ఎస్ భయపడుతుంది అంటూ కాంగ్రెస్ వాదిస్తుంటే,

బిఆర్ఎస్ నాయకుల పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు, విచారణలు అంటూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందని, ఇటువంటి ఉడత ఊపులకు బిఆర్ఎస్ భయపడదని, తమ నాయకులకు పార్టీ నుండి, పార్టీ క్యాడర్ నుండి పూర్తి మద్దతు ఉంటుందని ఇదంతా బిఆర్ఎస్ బలమంటూ కేటీఆర్ వాదిస్తున్నారు.

అయితే అది కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు బిఆర్ఎస్ భయమా.? లేక బిఆర్ఎస్ చెపుతున్నట్టు బలమా.? లేక బలప్రదర్శనా.? అనేది రానున్న కాలంలో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. అప్పటి వరకు ఈ భయాలు, బలాలు, బలప్రదర్శనలు అన్ని కూడా ఆయా రాజకీయ పార్టీల కాలక్షేపాలే..!

ADVERTISEMENT
Latest Stories