ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ కు హైకోర్ట్ ‘బ్రేకులు’

high court orders to sell agri gold assetsఉస్మానియా యూనివర్సిటీలో కూర పండగకు హైకోర్టు నో చెప్పేసింది. అనుమతించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పేసింది. ఈ విషయంలో సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులను యథాతథంగా పాటించాలని తీర్పు నిచ్చింది. కడెం రాజు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు… ఈ మేరకు తాజా వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఓయూలో బీఫ్ ఫెస్టివల్‌కు బ్రేక్ పడినట్టే అయ్యింది. ఐతే, కొన్ని విద్యార్థులు సంఘాలు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫెస్టివల్‌ని నిర్వహించి తీరుతామని పట్టుబట్టడంతో గురువారం ఈ పండగ జరుగుతుందా? పోలీసులు అడ్డుకుంటారా? అనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది.

ఓ వైపు పోలీసులు భారీగా బలగాలు మోహరించగా, మరోవైపు తమదైన శైలిలో పెద్దకూరకు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఈ ఫెస్టివల్‌కు సంబంధించి పోస్టర్స్‌తోపాటు పలురకాల వంటకాల్ని ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 20వ వరకు వర్సిటీలో ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహించ కూడదని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులు తమకు అందలేదంటున్నారు.

ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యే ప్రతిఒక్కరికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతామని, ఒకవేళ అడ్డుకుని దాడులకు పాల్పడితే వాళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని హెచ్చరించారు. చివరకు పోలీసులకూ ఇదే పద్ధతి వర్తిస్తుందని కుండబద్దలుకొట్టారు. సమయం దగ్గర పడుతుండడంతో ఓయూలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వెంటాడుతోంది.

ADVERTISEMENT
Latest Stories