అర్ధవంతమైన సినిమాలను తీసినపుడు ప్రశంసలతో ఎంతగా ప్రోత్సహిస్తారో, సీన్ కు సీన్ కు సంబంధం లేకుండా తీసినటువంటి ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాలపై అదే స్థాయిలో విమర్శలు చేయడం సినీ విశ్లేషకుల వంతు. అయితే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా చూసిన తర్వాత హీరో మహేష్ పై జాలి కలగడం ఎంత సహజమో మొదటి సన్నివేశంలోనే దర్శకుడు చెప్పేసాడు. అయితే అది చివరి సన్నివేశం వరకు ప్రేక్షకులకు తెలియకపోవడమే అసలు ‘ట్విస్ట్.’
సినిమా మొదలు కావడమే తిరుమలలో సమంత ఉన్న ఎపిసోడ్ నుండి మొదలవుతుంది… చివరికి అక్కడే ఎండ్ అవుతుంది. అయితే అసలు సినిమా ఫస్టాఫ్ లో ఎక్కడా సమంత కనపడదు. ఆ కధకు కూడా ఎక్కడా సంబంధం ఉండదు. మరి సమంత చెప్పే ‘ఫస్టాఫ్’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా ఆమెకు ఎవరు చెప్పారంటే దానికి జవాబు ఉండదు. సెకండాఫ్ లో మహేష్ గానీ, కుటుంబ సభ్యులు గానీ ఆ ‘ఫ్లాష్ బ్యాక్’ ను చెప్పినట్లు ఒక్క సీన్ కూడా ఉండదు. మరి దర్శకుడు ఏ విధంగా కధను చెప్పాలనుకున్నాడో గానీ, అసలు మొదటి సన్నివేశానికే అర్ధం లేదన్న విషయం చివరికి అర్ధమైపోతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు చెప్పాలనుకున్న కధకు సంబంధం లేని సన్నివేశాలు చాలా ఉన్నాయనుకోండి. సమంత – మహేష్ ల మధ్య ప్రేమ ఎలా పుడుతుందో దర్శకుడికైనా తెలుసో లేదో మరి? తన తండ్రి మాదిరి ‘ముందు నన్ను చెప్పనివ్వు’ అంటూ సమంత పలికే మాటలకు మహేష్ కు ఇష్టం కలగడం చూపించిన దర్శకుడు, మరి సమంత ఎలా ఇష్టపడిందో చెప్పలేదు. ఒక స్నేహితురాలి ఇంట్లో బయట వ్యక్తి వచ్చి ఉండిపోవడం, అతనితో కలిసి దేశమంతా తిరగడం… అసలు శ్రీకాంత్ అడ్డాల సహజత్వానికి బహు దూరంగా ఉన్న కాన్సెప్ట్. సినిమాలో చాలా అర్ధవంతమైన పాటలు ఉన్నాయి. వాటిని అందంగా చిత్రీకరించారు కూడా! అయితే, సన్నివేశాలు కూడా దానికి తగిన విధంగా ఉంటే, కొంతలో కొంత ప్రేక్షకులకు రిలీఫ్ ఇచ్చేవి.





