సినిమా సెట్స్ లో ఎలాంటి తమాషా సంఘటనలు జరుగుతుంటాయో అని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న “మొహంజోదారో” సినిమా షూటింగ్ లో హీరో హృతిక్ రోషన్ తన పట్ల చేసిన ఓ చిలిపి సంఘటన గురించి వివరించింది హీరోయిన్ పూజా హెగ్డే. హృతిక్ మాయ మాటలు నమ్మి, అమాయకంగా తానూ ఎలా మోసపోయానో చెప్తూ అందరికీ నవ్వులు పూయించింది పూజా.
లొకేషన్లో ప్రాక్టికల్ జోకులు వేస్తూ అందరినీ ఆటపట్టించే హృతిక్, ఓ సారి సుద్ద ముక్కను తెచ్చి, అది ప్రొటీన్ బార్ అని, దీన్ని తింటే శరీరానికి శక్తి వస్తుందని చెప్పాడట. అనుమానం వచ్చి ప్రశ్నిస్తే, ‘ఆరోగ్యాన్ని ఇచ్చేవేవీ ఆకర్షణీయంగా ఉండవు. చేటు చేసేవే నోరూరిస్తూ కమ్మగా ఉంటాయి. ప్రొటీన్ బార్ రుచిగా ఉండదులే’ అని మాయ మాటలు చెప్పి నమ్మించాడట. హృతిక్ మాటలు పూర్తిగా నమ్మి ఆ సుద్ద ముక్కను తినేసాన్ని, ఆపై విషయం తెలుసుకుని బుంగమూతి పెట్టుకోవడం తన వంతయ్యిందని చెప్తూ నవ్వేసింది ఈ ‘ఒక లైలా కోసం’ ముద్దుగుమ్మ.
హృతిక్ మాటలకు మోసపోయానని, ఏదేమైనా ఇదో తమాషా ఘటనని వెల్లడిస్తోంది అందాల ముద్దుగుమ్మ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పట్ల వీక్షకులు పెదవి విరిచిన విషయం తెలిసిందే. ‘బాహుబలి’ సినిమా మాదిరి ఉందని విమర్శలు వ్యక్తమైనప్పటికీ, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ “మొహంజోదారో.”



