మిర్యాలగూడ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వివాదంలో ఇరుక్కున్నారు. భాస్కర్ రావు వేధిస్తున్నాడంటూ ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కలిసింది. ఆయన భూకబ్జాలను అడ్డుకున్నందుకు తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని మిర్యాలగూడకు చెందిన బంటు మణెమ్మ ఫిర్యాదు చేసింది.
ఎమ్మెల్యే, స్థానిక పోలీసుల నుండి తమకు ప్రాణహని ఉందని, తమకు రక్షణ కలిపించాలని తన పిటిషన్ లో పేర్కొంది. అయితే మణెమ్మ భర్త బుచ్చిబాబు న్యాయవాది ముసుగులో భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆయనపై పీడీయాక్ట్ నమోదు చేశారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే తమ మీద దొంగ కేసులు పెడుతున్నారని మణెమ్మ ఆరోపణ.
తన భర్త,కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే,పోలీసుల వేధింపులతో తమ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడుపుతోందని… ఎప్పుడేం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. ఈ వార్త కొన్ని టీవీ ఛానెళ్లలో ప్రముఖంగా రావడంతో తెరాస నేతలలో కలవరం మొదలయ్యింది.
దుబాక ఉపఎన్నికల నేపథ్యంలో ఇటువంటి ఆరోపణలు రావడం వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని… ప్రతిపక్ష పార్టీలకు ఇది అవకాశంగా మారుతుందని అధికార పార్టీ ఆందోళన చెందుతుంది. ఈ విషయాన్ని సెటిల్ చెయ్యడానికి తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.




