ఈరోజు సాయంత్రం నుంచే హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలవుతాయి. అర్ధరాత్రి దాటే వరకు జరిగే ఈ వేడుకలలో మద్యం ఏరులై పారుతుందని వేరే చెప్పక్కరలేదు. కనుక నేడు అర్దరాత్రి వరకు వైన్ షాపులు అమ్మకాలు జరుపుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వమే అనుమతించినప్పుడు మందుబాబులు మందు కొట్టకుండా ఉంటారా? తప్పకుండా కొడతారు.
‘కొడితే కొట్టండి కానీ మందు కొట్టి వాహనాలు నడపొద్దు. నడిపితే నేరుగా జైలుకే’ అంటూ హైదరాబాద్ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఏదో మాట వరసకు కాదు నిజంగానే.. అంటూ పగలు రాత్రి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో మందు బాబులు లబో దిబో మంటున్నారు. అంతంత డబ్బు పోసి మందు కొడితే పోలీసులు ఒక్క నిమిషంలో కిక్కు దించేస్తున్నారని బాధపడుతున్నారు.
వారి బాధని కేవలం సాటి మందుబాబులే అర్థం చేసుకోగలరు. కానీ మేము కూడా అర్థం చేసుకోగలం అంటోంది తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ యూనియన్!
ఈరోజు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో మందుబాబులకు ‘ఫ్రీ రైడ్స్’ అందిస్తామని ప్రకటించింది. మందుబాబులు 897700 9804 నంబరుకి ఫోన్ చేసినట్లయితే వెంటనే వచ్చి పికప్ చేసుకొని భద్రంగా ఇంటి వద్ద దిగాబెడతామని తెలియజేసింది.
మానవతాదృక్పదం లాంటి మందుతాదృక్పదంతో గిగ్ వర్కర్స్ ఇలా ఉచిత సేవలు అందిస్తుండటం అభినందనీయమే. అంటే వారికి సంపాదన ఎక్కువై ఈ పని చేస్తున్నారేమో? అని సందేహం కలుగవచ్చు.
కానీ జీతాలు, కమీషన్ పెంచాలని, పది నిమిషాలలో డెలివరీ విధానం తొలగించాలని, తమకు ప్రమాద భీమా చేయించాలని కోరుతూ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు నేడు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెరుపు సమ్మె చేస్తున్నారు.
రోజంతా రోడ్లపై వాహనాలు వేసుకొని తిరుగుతూ అందరికీ నిత్యావసర సరుకులు, ఆహరం అందించే తాము ఏనాడూ సమయానికి భోజనం చేయలేమని గిగ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కష్టపడినా అటు వినియోగదారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు, తమ మేనేజర్ల నుంచి తిట్లు తినడమే తప్ప కుటుంబ పోషణకు సరిపడా డబ్బు సంపాదించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదని, కనీసం సమాజంలో తగిన గౌరవం కూడా లభించడం లేదని గిగ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేడు మూడు గంటల సమ్మె చేసి నిరసన తెలిపినప్పటికీ అర్ధరాత్రి వరకు ఈ చలి, ట్రాఫిక్‌లో తిరుగుతూ సేవలు అందించక తప్పదు. అంతేకాదు… నేడు హైదరాబాద్‌లో వాహనాలు బుకింగ్ రద్దు చేస్తే జరిమానా విధిస్తామని తమని యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయని గిగ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులలో, హైదరాబాద్‌లో ఎముకలు కోరికే చలిలో కూడా మందు బాబులకు ఫ్రీ రైడ్స్ అందిస్తుండటం చాలా గొప్ప విషయమే కదా?






