చేపా చేపా ఎందుకు ఎండలేదంటే గడ్డిమోపు అడ్డంగా ఉందన్నట్లు, సినిమాలలో విలన్… విలన్ నువ్వు ఎందుకు విలన్‌గా మారావంటే ఈ సమాజమే నన్ను విలన్‌గా మార్చేసిందని చెపుతుంటాడు.
పుష్పరాజ్ కూడా అలాంటివాడే కనుక అతనితో ప్రేక్షకులు మమేకమయ్యారు. అతను తమ జేబులు కొల్లగోడుతుంటే జేజేలు కూడా పలికారు.
ఇన్నాళ్ళుగా జనాలకి ఐబొమ్మతో కొత్త కొత్త సినిమాలు చూపించిన ఇమ్మడి రవి కూడా, అచ్చం ఇలాగే సమాజం వల్లనే విలన్‌గా మారి ఎక్కడో నెదర్లాండ్‌లో డెన్ ఓపెన్ చేసుకొని అందరినీ రంజింప చేస్తున్నాడు.
కానీ అతను పుష్పరాజ్ కాదు ‘దమ్ముంటే పట్టుకో’ అని పోలీసులకు సవాలు విసరడానికి! సమాజం చేసిన మామూలు విలన్ మాత్రమే!
కానీ ఆ సంగతి మరిచిపోయి దమ్ముంటే పట్టుకో అని సవాలు విసిరాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు పోలీసులు పట్టేసుకున్నారు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే.
కానీ అతను విషాదభరితమైన తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బయటకు వచ్చిన తర్వాత అతను కూడా సమాజం చేతిలో విలన్‌గా మారినవాడే అని స్పష్టమైంది.
సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇమ్మడి రవి చదువుకునే రోజుల నుంచి డబ్బుకి చాలా ఇబ్బందిపడేవాడు. ఆ కారణంగా అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా ఓ ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని ఎలాగో పెళ్ళి చేసుకున్నాడు. కనుక క్లైమాక్స్ ‘హ్యాపీ ఎండింగ్’ అనుకుంటే, అతని సంపాదన గురించి భార్య, అత్తగారు చాలా అవమానకరంగామాట్లాడటంతో హర్ట్ అయ్యాడు.
నాడు బోయవాడైన వాల్మీకి… ఓ పిట్టను చంపినందుకు బాధపడి జ్ఞానోదయం పొంది రామాయణం రచించినట్లు, ఇమ్మడి రవి కూడా ‘హర్ట్’ అవడం వలన ‘ఐబొమ్మ’తో సహా మరికొన్ని బొమ్మలను సృష్టించి కోట్ల రూపాయలు సంపాదించాడు. వాటితో కోట్ల మందిని అలరించాడు.
కానీ ఈ పోలీసులకు విషాదభరితమైన అతని ఫ్లాష్ బ్యాక్, హర్ట్ అయిన అతని ఇగోని కన్సిడర్ చేయలేదు…. పట్టించుకోలేదు. ‘దమ్ముంటే పట్టుకో…’ అనే ఒకే ఒక్క మాట పట్టుకొని అతనిని పట్టేసుకున్నారు.
పుష్పరాజ్ పోలీసులతో ఆడుకుంటునప్పుడు జనాలు చప్పట్లు కొట్టారు. కానీ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనకకి పంపినప్పుడు ఎవరూ జాలి పడలేదు. చప్పట్లు కొడుతున్నారు. లోకం తీరు ఎప్పుడూ ఇంతే!






