రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ నష్టపోతే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతకంటే దారుణంగా నష్టపోయింది. అయితే ఆ సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి ఇంచుమించు ఒకేవిదంగా ఉండేదు. రెండు రాష్ట్రాలలో విద్యుత్ కోతలు, మూతపడిన పరిశ్రమలు, ఆదుకొనేవారు లేక రైతుల ఆత్మహత్యలు, విద్యా, వైద్యం, మౌలిక వసతులు ఇలా ప్రతీరంగం ఎంతో వెనకబడిపోయి లోపభూయిష్టంగా ఉండేవి.
కానీ అప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకి చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వంటి దూరదృష్టి, ధృడసంకల్పం గల నాయకులు పగ్గాలు చేపట్టడంతో ఇద్దరూ పోటాపోటీగా తమతమ రాష్ట్రాలను గాడినపెట్టుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. కాకపోతే కేసీఆర్ చేతికి అక్షయపాత్ర వంటి హైదరాబాద్ నగరం లభించడంతో ఆయన మరింత వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగా, చంద్రబాబు నాయుడు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటూనే రాజధాని అమరావతి, పోలవరం పరుగులు పెట్టించి తన సమర్దత నిరూపించుకొన్నారు.
Also Read – అందరి చూపు, నాని HIT వైపే
తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపుతున్న కేసీఆర్‌నే మళ్ళీ ఎన్నుకోగా, ఆంధ్రా ప్రజలు జగన్మాయలో పడటంతో రాష్ట్రం పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయిపోయింది. ఒకవేళ చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర ప్రజలు నమ్మకముంచి మరోసారి ముఖ్యమంత్రిని చేసి ఉంటే నేడు రాష్ట్రంలో మరోస్థాయిలో ఉండేదని అందరికీ తెలుసు.
అందుకు టిడిపి స్వయంకృతం కొంత, ఏపీ ప్రజల అమాయకత్వం మరికొంత తోడవడంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దాంతోపాటే ఆలోచనలు, నిర్ణయాలు, విధానాలు అన్నీ సమూలంగా మారిపోయాయి. వాటితో రాష్ట్రానికి మంచి జరిగి ఉండి ఉంటే నేడు ఆంధ్రా ప్రజలు 2024లో ఎవరికి ఓటు వేయాలని పునరాలోచన చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ప్రతీ ఇంటికీ మేలు చేస్తున్నామని గర్వంగా చెప్పుకొంటున్న జగన్ ప్రభుత్వం, రాష్ట్రానికి తీరని నష్టం చేస్తోందని బహుశః అందరూ అంగీకరిస్తారు.
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
చేపలు పంచిపెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పించమని పెద్దలు ఊరికే అనలేదు. కానీ జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ముందుకు సాగుతుండటంతో నేటికీ సంక్షేమ పధకాలు అందుకొంటున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పధకాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అంటే అర్దం ఏమిటి? ప్రజలు ఇంకా ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నారనే కదా? జగన్ ప్రభుత్వం కూడా అదే కోరుకొంటోందని చెప్పక తప్పదు. సంక్షేమ పధకాలు కొనసాగాలంటే మళ్ళీ వైసీపీకే ఓట్లు వేసి గెలిపించాలని పదేపదే కోరుతుండటమే నిదర్శనం.
ఒకవేళ వైసీపీని మళ్ళీ గెలిపించుకొన్నా మరో 5 ఏళ్ళు సంక్షేమ పధకాలన్నిటినీ యధాతధంగా కొనసాగించగలదా?అంటే కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పధకాలకు నిధులు సమకూర్చుకోలేక రకరకాల నిబంధనలు, ఆంక్షలు విధించి ఆ సంక్షేమ భారం క్రమంగా తగ్గించుకొంటుండటం లబ్దిదారులందరికీ తెలిసిందే. కనుక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుచుకోకుండా ముందుకు సాగడమే కష్టం.
Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది
కనుక 2024 ఎన్నికలలో రాష్ట్రాభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చేవారికే ప్రజలు పగ్గాలు అప్పగిస్తే మళ్ళీ క్రమంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో మార్పు వస్తుంది. లేకుంటే మరో 5 ఏళ్ళు తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 15 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవచ్చు. రాజధాని లేని రాష్ట్రం అంటే యజమాని లేని ఇల్లు వంటిదని భావించవచ్చు. అది అందరికీ అలుసే. అది ఎప్పటికీ బాగుపడదు కూడా!
అమరావతి వస్తేనే ఐటి కంపెనీలు, పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. అమరావతి ఏర్పాటు చేసుకోగలిగితేనే మళ్ళీ ఆంధ్రా ప్రజలు గౌరవం పొందుతారు. గర్వంగా తలెత్తుకొని తిరుగగలుగుతారు. కనుక మన నమ్మకం, మన భవిష్యత్‌లో వేరెవరి చేతుల్లోనో లేదు. మన చేతుల్లోనే ఉందని గ్రహించడం చాలా అవసరం. సమర్దుడైన నాయకుడిని ఎన్నుకొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తెలంగాణలా అభివృద్ధి చెందుతుంది లేకుంటే బంగారు కత్తితో మెడ కోసుకొన్నట్లే అవుతుందని ప్రజలు గుర్తిస్తే చాలు.